నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమయ్యింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలలో అత్యధికస్థానాలు కైవసం చేసుకోడానికి ప్రధాన రాజకీయపార్టీలు తహతహలాడుతున్నాయి. ప్రధానంగా స్టీల్ సిటీ విశాఖపట్నం పార్లమెంట్ స్థానంలో నాలుగుస్తంభాలాటకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. నాలుగు పార్టీలకు చెందిన నలుగురు బలమైన అభ్యర్థులు ఢీ కొంటున్న ఈ పోరు ఎక్కడలేని ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఎన్నికలంటే అదీ నవ్యాంధ్రప్రదేశ్ లో పోల్ వార్ అంటే నిజంగా అది ఓ మహాసమరంలానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో సమరానికి రంగం సిద్ధమయ్యింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు ఈ ఎన్నికల్లో చావో బతుకో అన్నట్లుగా పోరాడుతున్నాయి. తమ అమ్ములపొదిలోని సకల అస్త్రాలను ప్రయోగించడం ద్వారా ఆరునూరైనా అధికారం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి.
మరోవైపు లేటు గా అయినా లేటెస్టుగా అన్నట్లు ఎన్నికల బరిలోకి దిగిన జనసేన సైతం తన ఉనికిని కాపాడుకోటానికి రెండు కొండల్ని ఢీ కొనే సాహసం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మొత్తం 25 పార్లమెంట్ స్థానాలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీకే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉండడంతో ఇప్పుడు ప్రతిస్థానమూ కీలకంగానే మారింది. అంతేకాదు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయటానికే వివిధపార్టీలు ప్రాధాన్యమిచ్చాయి.
అందులో భాగంగానే నవ్యాంధ్రప్రదేశ్ కే ఆయువుపట్టు లాంటి విశాఖ పార్లమెంట్ స్థానానికి టీడీపీ, వైసీపీ, బీజెపీ, జనసేన పార్టీలు గురిపెట్టాయి. అత్యంతబలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. విశాఖ పార్లమెంట్ స్థానంలో భీమిలి, విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, గాజువాక, పెందుర్తి , శృంగవరపు కోట అసెంబ్లీ స్థానాలు అంతర్భాగంగా ఉన్నాయి.
రాజకీయ చైతన్యంతో పాటు విద్యావంతులు, ఉద్యోగులు అధికంగా ఉన్న విశాఖ నియోజక వర్గం నుంచి నలుగురు బలమైన అభ్యర్థులు ఢీ కొనబోతున్నారు. అధికార టీడీపీ బాలకృష్ణ చిన్నల్లుడు, ఇద్దరు మాజీ ఎంపీల మనుమడు శ్రీభరత్ ను తమ అభ్యర్థిగా బరిలోకి దించింది.ఇదే స్థానానికి చెందిన సిటింగ్ ఎంపీ హరిబాబు పోటీకి దూరంగా ఉండడంతో ఆయన స్థానంలో బాలకృష్ణ సోదరి పురందేశ్వరి బీజెపీ అభ్యర్థిగా తన అదృష్టం పరీక్షించుకొంటున్నారు.
మరోవైపుతొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన జనసేన పార్టీ మాత్రం తమ అభ్యర్థిగా జెడీ లక్ష్మీనారాయణ రూపంలో ఏకంగా ఓ బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించింది. ప్రతిపక్ష వైసీపీ మాత్రం సినీనిర్మాత, ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను తమ అభ్యర్థిగా పోటీకి దించింది. ఈ నలుగురు అభ్యర్థులు తమదైన శైలిలో నామినేషన్లు వేసి ఎన్నికల్లో తొలి అంకాన్ని విజయవంతంగా ముగించగలిగారు. ఇక బరిలో మిగిలిన ఐదుగురు అభ్యర్థుల్లో నలుగురు బలమైన అభ్యర్థుల బలాబలాలను చూస్తే ఒకరికి ఒకరు తీసిపోని విధంగా కనిపిస్తున్నారు. విశాఖ లోక్‌సభకు అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీ పెద్ద కసరత్తే చేసింది. జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేల అభిష్టాన్ని గౌరవించి సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎక్కువమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటం క్షేత్రస్థాయిలో బలమైన పార్టీగా ఉండటంతో పాటు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సైతం ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే అవకాశముంది. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజెపీకి ఈ స్థానాన్ని కేటాయించారు. కంభంపాటి హరిబాబు ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.
దీంతో మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరిని లోక్‌సభ అభ్యర్థిగా బీజెపీ రంగంలోకి దింపింది. గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాలు తనకు లాభిస్తాయని పురందేశ్వరి ధీమాగా ఉన్నారు. మరోవైపు విశాఖ రైల్వేజోన్ స్మార్ట్ సిటీగా ప్రకటించడం తదితర అంశాలు భాజపాకు అనుకూలంగా ఉండనున్నాయి. అంతేకాకుండా విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలో కేంద్ర సంస్థలు ఎక్కువగా ఉన్నాయి.
ఇండియన్ నేవీ, స్టీల్‌ప్లాంట్‌తో పాటు మరికొన్ని సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా ఉత్తరాదికి చెందినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాదికి చెందిన ఓట్లు తమకు పడతాయని బీజెపీ ఆశపడుతోంది. ఇక జనసేన అభ్యర్థిగా జెడీ లక్ష్మినారాయణ అనూహ్యంగా తెరమీదకు వచ్చారు. వ్యక్తిగతంగా ఉన్నత విద్యావంతుడు కావడం.. నిజాయతీ గల అధికారిగా పేరుండటం, స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో పనిచేయడం లక్ష్మీనారాయణకు కలిసొచ్చే అవకాశముంది. నగరంలో ఉండే యువతలో ఎక్కువగా విద్యావంతులే కావడంతో వారంతా జనసేన వెంటే ఉంటారని ధీమా జనసేనలో కనిపిస్తోంది.
అంతేకాదు లక్ష్మీనారాయణ రూపాయి ఖర్చు కాకుండా అత్యంత నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేయటం, వివిధ వర్గాలకు చెందిన ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ తాను ఏం చేయగలనో వివరిస్తూ ఆకట్టుకొంటున్నారు. విశాఖ నగరంలో శాంతిభద్రతలు కాపాడటానికి తన దగ్గర ఓ మాస్టర్ ప్లాన్ ఉందని లక్ష్మీ నారాయణ ధీమాగా చెబుతున్నారు. విశాఖ పార్లమెంటరీ పార్టీ కన్వీనర్‌గా ఉన్న సినీనిర్మాత ఎంవీవీ సత్యనారాయణనే ఎంపీ అభ్యర్థిగా వైసీపీ బరిలో నిలిపింది.
జగన్ పట్ల అభిమానులు చూపిస్తున్న క్రేజ్ తో పాటు ప్రభుత్వ వ్యతిరేకతే తమకు బలంగా మారుతుందని వైసీపీ నేతలు చెబున్నారు. గ్రామీణ ప్రాంత ఓటర్లతో పాటు మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉండే ఎస్.కోట, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో వైకాపా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి భరత్, బీజెపీ అభ్యర్థి పురందేశ్వరి బంధుత్వాన్ని పక్కన పెట్టి అభ్యర్థులుగా తలపడటం చక్కటి వ్యక్తిత్వం, ఆదర్శభావాలతో తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన లక్ష్మీనారాయణ విశాఖస్థానాన్నేఎంచుకోడం స్టీల్ సమరానికే హైలైట్స్ గా నిలిచిపోతాయి.