ప్రకృతి సంపదకు పుట్టినిళ్లు నల్లమల అటవీ ప్రాంతం. అయితే ఇక్కడ గత వారం రోజులుగా అలజడి మొదలైంది. నల్లమల ఆటవీ ప్రాంతాన్ని నిప్పు ముప్పు వెంటాడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా నిప్పురాజుకుంటుందో తెలియని పరిస్థితి తలెత్తింది. వారం రోజుల వ్యవధిలోనే మూడుసార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకుని వందల ఎకరాల్లో అడవి సంపద కాలిబూడిదయ్యింది. అయితే ఈ అగ్ని ప్రమాదం మానవ తప్పిదంతోనే చోటుచేసుకుందని అటవీ శాఖాదికారులు అంటుండగా, అసలు కారణాలు ఏమై ఉంటాయోనని అటవీ ప్రాంతంలో నివాసముండే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమలలో వరుస అగ్ని ప్రమాదాలకు పర్యాటకుల వంటావార్పు , పాదచారుల సిగరేట్, బీడి కాల్చిపారేయడమే కారణమని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
మొదట ఉరుమండ దగ్గర చెలరేగిన మంటలను సకాలంలో స్పందించి ఆర్పివేశారు అటవీశాఖ అధికారులు. ఆ తర్వాత మరో రెండు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. శ్రీశైలం, మద్దిమడుగు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న భక్తులు, పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దూరప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు మధ్యమధ్యలో సేదతీరుతున్నారు. ఆ సమయంలో కాలక్షేపం కోసం కొందరు బీడీ, సిగరెట్లు కాల్చుతుండగా.. మరి కొందరు రహదారి పక్కనే వంటావార్పు చేస్తున్నారు. ఈ నిప్పురవ్వలు ఎగిసి అడవిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ నెల 1, 4వ తేదీల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. మొదటి ప్రమాదాన్ని వెంటనే గుర్తించి..మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో 20 ఎకరాల అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. రెండో ప్రమాదం దోమలపెంట సమీపంలోని ఉరుమండ దగ్గర జరిగింది. ఈ సారి మంటలు దాదాపు అయిదారు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. భారీ వృక్షాలు, ఔషధ మొక్కలు సైతం కాలిపోయాయి. ఈ రెండు సంఘటనలకు యాత్రికుల నిర్లక్ష్యమే కారణమని అధికారులు భావిస్తున్నారు. దోమలపెంట సమీపంలో గల ఆక్టోపస్ దృశ్య కేంద్రం ఆవరణలోని అడవిలో మంటలు ఏర్పడ్డాయి. మూడోసారి సుమారు రెండెకరాల అడవి అగ్నికి ఆహుతైంది.
అటవీశాఖ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటవీప్రాంతంలో అగ్గిని రాజేయడంపై నిషేధం ఉన్నప్పటికీ.. యాత్రికులు అక్కడక్కడా వంటలు చేయడం, బీడీ, సిగరెట్లు కాల్చడం నిత్యం జరుగుతున్నాయి. వంట పూర్తయ్యాక అగ్గిని ఆర్పకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నల్లమల అటవీ భూభాగం 2. 55 లక్షల హెక్టార్లు విస్తరించింది. మన్ననూరు శివారు నుంచి శ్రీశైలం, మద్దిమడుగు వరకు పూర్తిగా నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. 1.75 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని టైగర్ రిజర్వు ఫారెస్టుకు కేటాయించారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వన్యప్రాణులకు తీవ్రనష్టం తలెత్తుతోంది. టైగర్ రిజర్వు ఫారెస్టులో వేలాది వన్యప్రాణులు, ఔషధ మూలికలు ఉన్నాయి. వీటి భద్రతపై అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటకులు వంట చేయరాదని.. బీడీ, సిగరెట్లు కాల్చరాదని.. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని.. నాగర్‌కర్నూల్ జిల్లా డీఎఫ్‌ఓ హెచ్చరించారు. ఈ మేరకు సిబ్బందిని కూడా అప్రమత్తం చేశామన్నారు. ఇక ముందు అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడతామని... గస్తీ ముమ్మరం చేసి అటవీ సంరక్షణకు చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారి తెలిపారు.