విజయావకశాలపై లెక్కలు మెజారిటీల గణనలు. పాలకపక్షం ప్రతిపక్షం మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరంలో విజయనగరంలో ఎగిరే జెండాపై అప్పుడే ఉత్కంఠ పెరుగుతోంది? అందులో మరీ ముఖ్యంగా జిల్లాలోని ఎస్. కోట అసెంబ్లీ స్థానంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంటోంది. ఎన్నికల బరిలో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి ఇటు అభ్యర్థుల్లోనూ అటు పార్టీల్లోనూ కనిపిస్తోంది. మరి శృంగవరపుకోటలో గెలిచేదేవరు? పాగా వేసి పట్టు దక్కించుకునేదెవరు?
ఎస్.కోట అసెంబ్లీ పరిధిలో 2 లక్షల 12 వేల 623 మంది ఓటర్లుండగా, ఓటు హక్కు వినియోగించుకున్నది కేవలం లక్షా 82 వేల 199 మంది మాత్రమే. మొన్నటి ఎన్నికల్లో మొత్తం 86 శాతం పోలింగ్ నమోదవగా ఓటింగ్ సరళిని అంచనా వేసుకుంటున్న పార్టీలు గెలుపు తమదంటే తమదన్న భరోసాతో ఉన్నారు.
శృంగవరపుకోట నియోజకవర్గంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య పోరు హోరాహోరిగా సాగింది. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్దిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి వైసీపీ నుంచి కడుబండ శ్రీనివాసరావు బరిలో నిలిచారు. వీరితోపాటు నియోజకవర్గంలో జనసేన తరుపున వామపక్షాల అభ్యర్థి, బీజేపీ, కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వాడివేడిగా మొదలైన ఎన్నికల సమరంలో పోటీ నువ్వానేనా అన్నంతగా సాగింది. ఒకదశలోనైతే అంతా ఏకపక్షమనుకున్నారు. కానీ ఎన్నికల ఎత్తుగడలతో రసవత్తరంగా పోరుగా మారింది.
శృంగవరపు కోట నియోజకవర్గం ఓటర్లలో వచ్చిన మార్పుతో హోరా హోరీ పోరు సాగిందనే చెప్పాలి. దీంతో నాయకుల్లోనూ అటు ప్రజల్లోనూ ఉత్కంఠత నెలకొంది. ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక పోటీలో నిలిచిన అభ్యర్తులైతే నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ శాతాలను లెక్కలు కడుతూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారే తమ గేలుపు ఖాయమంటూ మెజారిటీలను లెక్కిస్తున్నారు. మరి ఈ సమరంలో గెలిచేదెవరు శృంగవరపుకోట పీఠాన్ని దక్కించకునేదెవరో తేలాలంటే ఫలితాలు వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.