వారణాసిలో మోడీ ఇమేజ్ ఎలా ఉంది?

Update: 2019-04-17 16:16 GMT

తాను చౌకీదార్ నంటున్నారు. దేశమంతా తిరుగుతున్నారు. ప్రతిపక్షాలపై ఆరోపణల అస్త్రాలను ఎక్కు పెడుతున్నారు. మాటలతో చెడుగుడు ఆడేస్తున్నారు. ఎన్నికల కోడ్ నూ లెక్క చేయడం లేదు. ఈసారీ వార్ వన్ సైడే నని ధీమాగా ఉన్నారు. ఢిల్లీ గద్దెపై మళ్లి కూర్చునేది తానేనని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ మోడీ ధీమా సంగతి సరే ఆయన సొంత నియోజక వర్గంలో సీన్ ఎలా ఉంది? ఈ అంశంతో పాటు రెండో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల వివరాలతో మీముందుకొచ్చేసింది ఓట్ ఇండియా. దేశమంతా చుట్టేస్తున్నారు. ప్రత్యర్ధులపై అదిరిపోయే పంచ్ లతో సెటైర్లు విసురుతున్నారు.. దేశభక్తిని రగిలింప చేస్తున్నారు. విజయంపై మనసులో శంక పీడిస్తున్నా పైకి మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు. మొత్తం మీద తాము లేనిదే దేశ భద్రతే లేదన్నంతగా మాటల కోటలు కడుతున్నారు.. అంతా బానే ఉంది. మరి సొంత నియోజక వర్గంలో సీన్ ఎలా ఉంది? వారణాసిలో మోడీ ఇమేజ్ ఎలా ఉంది? లెటజ్ చెకిట్.

2019 ఎన్నికలు బీజేపీకి తిరిగి అధికారాన్ని కట్టబెడతాయా? గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయ దుందుభి మోగించిన బీజేపీ ఈ ఎన్నికలలో ఎన్ని సీట్లు సాధిస్తుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయిదేళ్లలో బీజేపీ సాధించిన విజయాలు, వైఫల్యాలపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈసారి గెలుపెవరిదన్న సందేహాలూ రేగుతున్నాయి. ఈఎన్నికల్లో ఆయనకు పోటీగా ప్రియాంక నిలబడాలంటూ కాంగ్రెస్ శ్రేణులు కొందరు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు కూడా..

గత ఎన్నికల్లో మోడీ వారణాసి, వడోదర రెంటిలోనూ పోటీ చేశారు. రెండింటిలోనూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే కాశీ విశ్వేశ్వరుని సెంటిమెంట్ కారణంగా వడోదరకు రాజీనామా చేసి వారణాసిని ఉంచుకున్నారు.మరి ఈసారి ఒక్క నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతారా?

గత ఎన్నికల్లో మోడీ వారణాసికి చాలా హామీలే ఇచ్చారు. గంగానదిని ప్రక్షాళన చేస్తానని, హ్యాండ్ లూమ్ వర్కర్ల సంక్షేమానికి కృషి చేస్తాననీ మాటిచ్చారు. కాశీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దుతానన్నారు. టూరిజం పెంచుతాననీ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతాననీ మోడీ గత ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అయితే ఇప్పుడుఈ హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మోడీ రాక వారణాసి నగరానికి ఉపయోగ పడింది కానీ.. జనాలకు కాదు అనే టాక్ వినిపిస్తోంది. వారణాసికి మోడీ కొత్త సొబగులద్దారు.. నగరాన్ని అందంగా తీర్చి దిద్దారు. కానీ అక్కడి జన జీవితాల్లో మాత్రం మార్పు తేలేకపోయారు. వారణాసిలో ఇప్పుడు ఎటు చూసినా ఫ్యాన్సీ వీధి దీపాలు వెలుగుతున్నాయి. అలాగే రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ ను అందంగా తీర్చి దిద్దారు.. గంగా నదిపై విహారానికి బ్యాటరీ బోట్లను ఏర్పాటు చేశారు. హై ఓల్టేజ్ బల్బుల స్థానంలో ఎల్ ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏర్పాట్లు నగర శోభను ఇనుమడింప చేస్తాయి తప్ప స్థానిక జనం జీవితాల్లో మార్పు ను మాత్రం తీసుకు రాలేవు. మోడీ వారణాసి ప్రతినిధి కాబట్టి ఆ ప్రాంతానికి జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత మాత్రం పెరిగింది. స్థానికంగా మోడీ పేరున ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. అక్కడకు ఫిర్యాదులు, వినతులు వెల్లువెత్తుతాయి. కానీ వాటిని పరిష్కరించే పరిస్థితి మాత్రం కనిపించదన్నది స్థానికుల వాదన..

మరోవైపు మోడీ వారణాసికి చాలా చేశారంటుంది బీజేపీ.. అయిదేళ్లలో 18 సార్లు వారణాసి వచ్చిన మోడీ వచ్చిన ప్రతీసారి నియోజక వర్గానికి సంక్షేమ కార్యక్రమాలు తెస్తూనే ఉన్నారని బీజేపీ నేతలంటున్నారు. వారణాసి అభివృద్ధికి ఇప్పటి వరకూ34 వేల కోట్లు నిధులిచ్చారు.కానీ వారణాసిలో మోడీ ప్రారంభించిన ప్రతీ స్కీము విఫలమైందనే అంటున్నారు స్థానికులు.. గంగా నదిలో కాలుష్యం తగ్గించడానికి బ్యాటరీ బోట్లను ప్రవేశపెట్టారు. జపాన్ లోని సాంస్కృతిక నగరం క్యోటో మాదిరిగా కాశీనీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక వాణిజ్య సహకార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ స్కీములేవీ సరిగా నడవడం లేదు. 

Similar News