దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన గూర్ఖా జనముక్తి మోర్ఛా, గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ సంస్థలు ఇప్పుడు మాత్రం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యాలంటున్నాయి.ఈ రెండు సంస్థలు వ్యూహాత్మకంగా బీజేపీ, తృణమూల్ పార్టీలకు వంత పాడుతున్నాయి. ఎందుకు?
గూర్ఖాలాండ్ సమస్యకు రాజకీయపరిష్కారమే మంచిదని ఉద్యమ సంస్థలు నమ్ముతున్నాయి. దశాబ్దాలుగా పోరాడినా ఎలాంటి పరిష్కారం దొరక్కపోవడంతో ఎన్నికల బరిలోకి దిగే తమ సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. పోరాటంతో సమస్య పరిష్కారం కానప్పుడు, ప్రజాస్వామ్య ప్రక్రియలోకి అడుగు పెట్టి ఎన్నికల ద్వారా సాధించుకోవడం మంచిదనే ఉద్దేశంతో గూర్ఖాలాండ్ ఉద్యమంపై పోరాడుతున్న సంస్థలు భావిస్తున్నాయి. గూర్ఖా ఉద్యమం రాజకీయ అంశం కాకపోయినా తాము దీనిని వదిలేది లేదని అంటున్నారు గూర్ఖా జనముక్తి మోర్ఛా నేత బిమల్ గురుంగ్ . ప్రత్యేక రాష్ట్ర సాధనలో తమ పోరు కొనసాగుతోందని ఈ ఎన్నికల్లో తమ డిమాండ్ దేశవ్యాప్తంగా తెలిసేలా చేస్తామని బిమల్ గురుంగ్ తెలిపారు.
గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ నేత సుభాష్ ఘీషింగ్ కు అనుచరుడుగా ఒకప్పుుడు వ్యవహరించిన గురుంగ్ కాలక్రమంలో ఆయనతో విభేదించారు. పశ్చిమ బెంగాల్ నియంతృత్వధోరణిని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఈ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా తమ ఆశయాన్ని నెరవేర్చుకుంటామని గురుంగ్ అంటున్నారు. గూర్ఖా కొండల్లో ప్రస్తుతం పైకి కనిపిస్తున్న ప్రశాంతత వెనక బడబాగ్ని దాగుందని గూర్ఖా ఉద్యమకారులంటున్నారు.ఈ స్మశాన నిశ్శబ్దం వెనక అణు బాంబంత అసహనం ఉందని చెబుతున్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలకు అర్ధం లేకుండా పోతోందని, అవినీతి పెరిగిపోయిందని, చివరకు అత్యున్నతమైన న్యాయ వ్యవస్థను కూడా అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.కేవలం డార్జిలింగే కాదు, అలీపూర్దౌర్, కూచ్ బేహార్ లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో కూడా తృణమూల్ పాలనపై వ్యతిరేకత ఉంది. డార్జిలింగ్ లోక్ సభ స్థానాన్ని బిస్తా టీమ్ గెలుస్తుందన్న నమ్మకంతో గురుంగ్ టీమ్ ఉంది.తమ అభ్యర్ధికి ప్రచారం కూడా అవసరం లేదని ప్రజలంతా భావో్ద్వేగంతో తమతో కనెక్ట్ అయి ఉన్నారని బిమల్ గురుంగ్ దళం నమ్ముతోంది.70 శాతం ప్రజలు ఇప్పటికీ తమనే నమ్ముతున్నారని గూర్ఖా జనముక్తి మోర్ఛా చెబుతోంది. బెంగాల్ ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాన్ని అణచివేస్తోందని ఈ అణచివేత ధోరణిని ప్రశ్నించడమే తమ ఉద్దేశమని గూర్ఖా జన ముక్తి మోర్ఛా అంటోంది.