ఇందూరు పాలిటిక్స్‌‌ను షేక్‌ చేస్తున్న షాడో ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా?

Update: 2019-07-19 02:48 GMT

ఆ జిల్లాలో ఆయన మాస్ లీడర్.. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.. ఓటమి ఎరుగని నేతగా.. ప్రజల్లో మంచి ప్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంత పాపులారిటీ ఉన్న ఆ నేతను కొందరు ఆయన అనుచరులే డ్యామేజ్ చేస్తున్నారు. వివాదాల్లో తలదూర్చి ఆ ఎమ్మెల్యేను జనాల్లో విలన్ చేస్తున్నారు. ఆ నోటా ఈ నోటా ఆ ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు కాస్తా... పార్టీ అధినేత దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆ ఎమ్మెల్యే, వాళ్లకు తనకు సంబంధం లేదని చెప్పుకునే పరిస్ధితి వచ్చింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఏంటా కథా.. తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.

ఇందూరు రాజకీయాల్లో ఆయన సీనియర్ ఎమ్మెల్యే. సామాజిక వర్గంపరంగా బలమైన నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మాస్ లీడర్‌గా గుర్తింపు సాధించారు. ఐతే ఆయనకు తాము ఎంత చెబితే అంతా అని చెప్పుకునే కొందరు ఆయన అనుచరులు ఆ ఎమ్మెల్యే పేరు చెప్పి భూకబ్జాలకు, సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నాట్లు ఏకంగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. అదే ఇప్పుడు నిజామాబాద్ గులాబీలో కాక రేపుతోంది.

ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో.. సీఎం కార్యాలయం సదరు ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు, ఆస్తులపై ఆరా తీస్తోంది. అప్పటికే ఇంటలిజెన్స్ అధికారులు ఎమ్మెల్యే పేరుతో అనుచరుల ఆగడాలు వాస్తవమేనని, ఓ నివేదిక సైతం సమర్పించారట. ఐతే ఇవన్ని సదరు ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతున్నాయా.. ? తెలియక జరుగుతున్నాయా అంటే కొందరు ఔనని.. మరికొందరు కాదని సమాధానం చెబుతున్నారంట. కానీ ఆయన వ్యతిరేక వర్గం మాత్రం పూసగుచ్చినట్లు పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే మూడు నియోజకవర్గాలు మార్చారు. కానీ ఎప్పుడు కానంత కాంట్రవర్సీ.. ఇప్పుడు జరుగుతోంది. కారణం ఆయన ఎక్కువగా నమ్మిన వ్యక్తి ఏకంగా షాడో ఎమ్మెల్యేగా అవతారం ఎత్తడమే. కుటుంబ సభ్యులకు లేనంత ప్రాధాన్యం సదరు ఎమ్మెల్యే, ఆయనకు ఇస్తారనే ప్రచారం ఉండటంతో, ఇక ఆయన ఆటలకు అద్దు అదుపూ లేకుండా పోయిందని పార్టీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సదరు ఎమ్మెల్యేకు, 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రి బెర్త్ ఖాయమనే ప్రచారం జరిగింది. అప్పుడు నిరాశ ఎదురైంది. 2018లో మొదటి విడతలో మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశించారు. ఇప్పుడు కూడా ఆయనకు మొండి చేయే మిగిలింది. రెండో విడత విస్తరణలో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో, కొందరు అనుచరుల భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలతో, ఆ ఎమ్మెల్యేకు ఉన్న ఆశలు సైతం ఆవిరవుతున్నాయి.

ఇటీవల ఓ రైతు భూకబ్జా విషయంతో పాటు, ఆ ఎమ్మెల్యే పరిధి దాటి ఇతర నియోజకవర్గాల్లో అనుచరులు వేలు పెడుతుండటం వివాదస్పదంగా మారింది. ఈ విషయంపై సీఎం పేషీ సైతం ఆరా తీసినట్లు సమాచారం. సదరు ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలపై సమగ్ర నివేదిక కోరగా.. ఇంటలిజెన్స్ అధికారులు ఆ షాడో ఎమ్మెల్యే లెక్కల చిట్టా తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు, ఆ ఎమ్మెల్యే పేరు చెప్పి పబ్బం గడుపుతున్నట్లు అధికారుల విచారణలో తేలిందట. వారిలో ఇద్దరు అనుచరుల తీరు సహచర ఎమ్మెల్యేలకు సైతం విసుగు పుట్టిస్తోంది.

వివాదాలు లేని భూముల్లో, వివాదాలు సృష్టించి తక్కువ ధరకు భూములను లాక్కోడం, కబ్జాలకు పాల్పడుతుండటం లాంటి ఫిర్యాదులు ఎక్కువగా ఉండటంతో.. సీఎం కేసీఆర్ ఆ ఎమ్మెల్యే అనుచరులపై సమగ్ర నివేదిక తెప్పించుకున్నారట. త్వరలో సదరు ఎమ్మెల్యేను పిలిచి అనుచరుల విషయంపై ఆరా తీసే అవకాశం ఉండటంతో.. ఇప్పుడా ఎమ్మెల్యే కొత్తస్వరం వినిపిస్తున్నారట. వివాదాల జోలికి వెళ్తున్న వారు తనవాళ్లు కాదని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. ఉరుము, ఉరిమి మంగళం మీద పడ్డట్లు, అనుచరుల ఆగడాలు ఆ ఎమ్మెల్యేకు ఎసరు పెడుతున్నాయట. అధినేత దృష్టిలో పడాలని ఏళ్లుగా ఎదురు చూస్తున్న సదరు ఎమ్మెల్యేకు అనుచరులు చేస్తున్న చట్టవ్యతిరేక పనులు, ఆయన సీటుకు ఎసరు పెట్టేలా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఆయన మంచివాడే, కానీ ఆయన చుట్టూ ఉన్న కోటరీని దూరం పెట్టకపోతే, ఆ ఎమ్మెల్యేకు గడ్డు కాలం తప్పదనే చర్చ జిల్లాలో జరుగుతోంది. ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే తన షాడోలను పక్కనపెట్టి, ఉన్న మంచి పేరు నిలబెట్టుకుంటారో, పాతాళానికి తొక్కేసుకుంటారో చూడాలి.

Full View 

Tags:    

Similar News