విమర్శించే హక్కు లేదా భావప్రకటన స్వేచ్చను గౌరవించడం అంటే ఆ విమర్శనో, భావాన్నో అంగీకరించడమని అర్ధం కాదు. ఆ విమర్శ లేదా భావం పొరపాటయితే తగిన విధంగా వాస్తవాలతో, హేతుబద్ధమైన వాదనలతో వాటిని తిప్పి కొట్టే హక్కు విమర్శలకు గురైన వ్యక్తులకు ఉన్నాయి. రాజ్యాంగంలోని 19 (1) (ఏ) అధికరణలో ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని పొందుపరిచారు. అనగా ప్రతి ఒక్క పౌరుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చని, రాయవచ్చని కాదు. ఆ స్వేచ్చకు కొన్ని హేతుబద్ధమైన పరిమితులు సైతం విధించారు. 19(2) అధికరణలో వాక్ స్వాతంత్ర్యాన్ని అదుపుచేసే చట్టాలు ఏ మేరకు చేయవచ్చో వివరించారు.
దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు, దేశ భద్రత కోసం, ఇతర దేశాలతో సత్సంబంధాల కోసం, శాంతిభద్రతలను పరిరక్షించడం కోసం ఈ చట్టం ద్వారా పరిమితులు విధించవచ్చు. అంతే కానీ అధికారంలో ఉన్న వాళ్ళకు నచ్చలేదనో, వారికి ఇబ్బందిగా ఉందనో, వారి నిర్ణయాలను లేదా చర్యలను విమర్శించారనో వ్యక్తుల భావప్రకటన స్వేచ్చను అరికట్టే హక్కు ఏ ప్రభుత్వానికి, ఎవ్వరికీ కూడా లేదు. వ్యక్తికి ఉన్న భావప్రకటన స్వేచ్చ, వాక్ స్వాతంత్ర్యాలనుంచి పత్రికా స్వేచ్చ పుట్టింది. గత కొన్నేళ్ళుగా ప్రభుత్వాలలోనే కాదు సమాజంలోనూ అసహనం పెరిగింది.
భావాలను భావాలతో, వాదనలతో ఎదుర్కోవాలి. కానీ, పైశాచిక దాడులు, తిట్లు శాపనార్ధాలతో నోరు మూయించే ప్రయత్నాలు ప్రస్తుతం ఎక్కువవుతున్నాయి. తాము నమ్మిన నవ సమాజ నిర్మాణంకోసం శాంతియుతంగా ప్రయత్నం చేస్తున్న కల్బూర్గి, గోవింద్ పన్సారి, నరేంద్ర ధబోల్కర్ లను అత్యంత దారుణంగా హత్య చేయించారు. అదే విధంగా సామాజిక కార్యకర్త, పాత్రికేయురాలు గౌరీ లంకేష్ ను కూడా దారుణంగా చంపించారు. వారికి నచ్చని పత్రికలపై రాజకీయ పక్షాలో, ప్రభుత్వాలో దాడులను ప్రోత్సహించడం చేయడం పరిపాటి అయింది. వివిధ పార్టీల నాయకులు చట్టసభల్లోనూ, పత్రికా ప్రకటనల్లోనూ సభ్యతను మరచిపోయి ప్రత్యర్ధులపై అభ్యంతరకర భాషను ప్రయోగిస్తున్నారు. తమను విమర్శిస్తున్న వారి వాదనను కనీసం వినే ఓపిక కూడా లేకుండా గట్టిగా అరిచి, గీపెట్టిన బలవంతంగా అడ్డుకోవడం నిత్యకృత్యంగా మారిందని చెప్పవచ్చు.
సమాజంలో పాత్రికేయులు,మేధావివర్గం వారు సైతం టీవీ చర్చల్లో అర్ధం పర్ధం లేని అరుపులను ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో, ఆధారాలు లేని ఆరోపణలకు, తిట్లకు తెగబడే ధోరణీని ఇనుమడిస్తోందని చెప్పవచ్చు. ఇవన్నీ పెరుగుతున్న హింసాత్మక ధోరణులకు, అనాగరిక ప్రవర్తనకు, అణచివేత సంస్కృతికి, సమాజాన్ని ముక్కలు చేసే ధోరణులకు ఉదాహరణలు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 7దశాబ్ధాలపాటు ప్రజాస్వామ్యానికి, వ్యక్తి స్వేచ్చకు, భావప్రకటనకు, పత్రికాస్వేచ్చకు, ఉదార విలువలకు ప్రపంచమంతా అమిత గౌరవం ఇచ్చింది. నియంతృత్వం, ప్రభుత్వ గుత్తాధిపత్యం ఏ రూపంలో ఉన్నా అవి ఆనాడు అప్రతిష్టతనే మూటగట్టుకున్నాయి.
అధికారమే సర్వస్వంగా భావించే వికృత రాజకీయానికి కళ్ళెం వేయలేకపోవడం వంటి వాటి కారణంగా భావప్రకటన స్వేచ్చకి, పత్రికాస్వేచ్చకు సంకెళ్ళు పడుతున్నాయి. స్వేచ్చను సద్వినియోగం చేసుకోలేని సమస్యకు నియంతృత్వం పరిష్కారం అసలు కానేకాదు. పాఠకులకు ఏ పత్రిక చదవాలో నిర్ణయించుకునే హక్కు, ఏ పుస్తకం కొనాలో కోరుకునే స్వేచ్చ ఉన్నంతకాలం, ఎప్పుడు ఏ చానల్ ను మార్చాలో నిర్ణయించే హక్కు ప్రేక్షకుల చేతుల్లో ఉన్నంతకాలం పత్రికల్లో దొర్లే పొరపాట్లకు విరుగుడు సమాజంలోనే ఉంటుంది. ఈ ప్రస్తుత నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్రపై, ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి ఎదురవుతున్న సవాళ్ళపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది.