ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్... పార్టీల తారకమంత్రమా?

Update: 2019-01-29 04:53 GMT

బీజేపీ సంధించిన EWS అస్త్రం విపక్షాలను బిత్తరపోయేలా చేసింది. బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా ఉన్నత విద్యాసంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటి అమలు ప్రారంభమైపోయింది. సంక్షేమ పథకాల అమలులోనూ EWS ను అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరో వైపున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో సహా కొన్ని రాష్ట్రాలు ఈ చట్టానికి మరో విధమైన భాష్యం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు వినవస్తున్నాయి. చట్టం అమలులో పాలనాపరమైన, చట్టపరమైన అడ్డంకులు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్రప్రభుత్వ రంగసంస్థల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్రప్రభుత్వ రంగ సంస్థల్లో ఫిబ్రవరి 1 నుంచి EWS రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇవి కొంతమేరకు చేయూతను అందిస్తాయనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి జారీ అయ్యే అన్ని ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లకు చట్టప్రకారం 10 శాతం EWS కోటా వర్తించనుంది. దేశవ్యాప్తంగా 330కిపైగా కేంద్రప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ నియామకాల్లో ఈ కోటా వర్తించనుంది. ప్రభుత్వరంగంలో ఉద్యోగాలే లేనప్పుడు కొత్త రిజర్వేషన్లు అనవసరం అని కొందరు వాదిస్తున్నారు. అయితే, కనీసం చదువుకునే అవకాశమైనా ఈ రిజర్వేషన్ల వల్ల కొన్ని వేల మంది పేద విద్యార్థులకు కలుగుతుందనడంలో మాత్రం సందేహం లేదు.

రానున్న లోక్ సభ ఎన్నికలను, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని EWS రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అది అర్థసత్యమే. రిజర్వేషన్లు లేని ఇతర వర్గాల పేదలకు రిజర్వేషన్లు కల్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే విపక్షాలు సైతం మద్దతు పలకాల్సి వచ్చింది. EWS రిజర్వేషన్ల బిల్లు ఎన్నికల స్టంట్ మాత్రమే అయితే చట్టసభల్లో విపక్షాలు దాన్ని వ్యతిరేకించాల్సి ఉండాల్సింది. అవి అలా చేయలేదంటే దాని అర్థం ఆ బిల్లు అవసరం ఉందనే. ఏడు దశాబ్దాల పాటు అమలు చేసిన రిజర్వేషన్లు నేటికి ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి. మరెన్ని దశాబ్దాల పాటు ఆ రిజర్వేషన్లను కొనసాగించాలో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇతర వర్గాల వారిలో నెలకొన్న అసంతృప్తిని కొంతమేరకైనా చల్లార్చేందుకు పేదలకు రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకురాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.  

Similar News