దేశంలో విచిత్ర రాజకీయ పరిస్థితి కనిపిస్తుందిప్పుడు. గెలుపు మాదంటే మాదంటూ బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నా... లోలోపల అనుమానాలు మాత్రం ఆ రెండు పార్టీలను వెంటాడుతూనే ఉన్నాయి. రెండు దశాబ్దాల కిందటి పరిస్థితి గమనిస్తే ఇప్పుడు కూడా అదే పునరావృతం కావచ్చన్న అంచనాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. దేశంలో ఇప్పటికే 372 లోక్‌సభస్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఇంతకుముందు జరిగిన ఎన్నికలపై... మిగిలిన స్థానాలపై రాజకీయ విశ్లేషణలు మరింత ఆసక్తికి తెర తీస్తున్నాయ్.
1998, 1999 ఎన్నికల్లో బీజేపీ 25.59%, 23.75% ఓట్లతో 182 చొప్పున సీట్లు దక్కించుకొంది. అదే సమయంలో కాంగ్రెస్ 25.82%, 28.30% ఓట్లతో వరసగా 141, 114 సీట్లు సొంతం చేసుకొంది. 1998తో పోలిస్తే 1999లో బీజేపీకి 1.84% ఓట్లు తగ్గినా సీట్లు మాత్రం 182 వచ్చాయి. కాంగ్రెస్ ఓట్లు 2.48% పెరిగినా 27 సీట్లు తగ్గాయి.
2004 ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఓట్లు 1.77% తగ్గినప్పటికీ 31 సీట్లు పెరిగాయి. ఇదే సమయంలో బీజేపీ 1.59% ఓట్లను కోల్పోయి ఏకంగా 44 సీట్లను పోగొట్టుకొంది. ఈసారి ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రావొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్రాల వారీగా రెండు జాతీయ పార్టీలు సాధించిన సీట్లు ప్రస్తుతం విశ్లేషకులు వేస్తున్న అంచనాలకు దాదాపు దగ్గరగా ఉన్నాయి.
1998, 99 నాటికి ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడలేదు. వాటి మాతృ రాష్ట్రాల్లోనే ఎన్నికలు జరిగాయి. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో రెండు జాతీయ పార్టీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కాయి. ఇప్పుడు రెండింటికీ ఆ అవకాశం కనిపించడం లేదు. మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ కొంత అటూఇటుగా పరిస్థితి ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అంచనాలకు అద్దం పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ గతం కంటే కొంత బలం పుంజుకున్నా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. జాతీయ రాజకీయాలపై ఆ పార్టీ నాయకత్వం బలమైన ముద్ర వేయలేకపోవడంతో 1999 స్థాయికి పరిమితమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 2014లో మోడీ గాలి వల్ల లోక్‌సభలో కాంగ్రెస్ బలం 44కి పడిపోయింది. అంతకుముందు 1999లో వచ్చిన 114 స్థానాలే ఆ పార్టీకి అతి తక్కువ స్థానాలు. 2014తో పోలిస్తే కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం పుంజుకుంది. మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, ఇతర కూటములు బీజేపీని నిలువరించగలిగే స్థితిలో ఉన్నాయి కాబట్టి ఆ మేరకు లభించే సీట్లు- కాంగ్రెస్‌కు పరోక్షంగా మేలు కలిగించే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.