మాతృభాషలో సరిగా మాట్లాడలేరు. కానీ రెండు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. వెనుకబడిన రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఇదీ అని చూపించారు. అవినీతి బురదలో కూరుకుపోయిన రాజకీయాల్లో ఆయన పథం నవీనం, నిత్యనూతనం. కేంద్రంలో ఇరవై ఏళ్లుగా సీఎం నవీన్ పట్నాయక్‌కు తిరుగులేదు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నవీన్‌పై నమ్మకం చెక్కు చెదరకపోయినా ఆయన చుట్టూ ఉండే వారిపై అసమ్మతి రాజుకుంటోంది. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయా? బీజేపీ క్షేత్రస్థాయిలో పట్టుపెంచుకోవడం బీజేడీకి ఎసరు పెడుతుందా? ఈ రాష్ట్రంలో మోడీ మేజిక్ ఎంతవరకు పని చేస్తుంది? ఈసారి ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది.?
అవినీతి రహిత పరిపాలన. ఇదే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జెండా ఎజెండా. అదే ఆయన ఇమేజ్‌ను జాతీయ స్థాయిలో పెంచింది. ప్రధాని కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని కలిగించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవీన్‌ను ఇన్నాళ్లూ అక్కున చేర్చుకున్న జనం ఈసారి తమ దారి మార్చుకుంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అవినీతి అధికారులు, నేతలపై నవీన్ పట్నాయక్ చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మైనింగ్, చిట్‌ఫండ్ స్కామ్‌లో నవీన్ వ్యవహార శైలి ప్రజల్లో చర్చనీయాంశమైంది. పార్టీలో అంతర్గతంగా చాలా కాలంగా అసమ్మతి సెగలు కక్కుతోంది. గత ఎన్నికల్లో 21 సీట్లకు 20 సీట్లను బిజూ జనతాదళ్ గెలుచుకుంది. బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే మెరుగ్గా 26 శాతం ఓట్లు సంపాదించినా సీట్లను మాత్రం సాధించలేకపోయింది.
మహిళా ఓటర్లలో ఇప్పటికీ నవీన్ పట్నాయక్‌కి గట్టి పట్టు ఉంది. 70 లక్షలకు పైగా మహిళలతో స్వయం సహాయక గ్రూపుల్ని ఏర్పాటు చేసి శక్తి పథకం కింద వారికి అండదండగా ఉంటున్నారు. ఆ గ్రూపు మహిళలే బీజేడీ ఓటు బ్యాంకుకి శక్తిగా మారారు. స్వయం సహాయక గ్రూపుల్లో దేశంలోనే ఒడిషా నంబర్‌వన్‌గా నిలిచింది. మహిళలకు 33 శాతం టికెట్లు ఇవ్వడం కూడా నవీన్‌కు కలిసొచ్చే అంశం.
బీజేపీ ఈసారి తూర్పు రాష్ట్రాలపైనే గురి పెట్టింది. బీజేపీ 296 పంచాయతీ స్థానాలను గెలుచుకుంది. ముఖ్యంగా పశ్చిమ ఒడిశా జిల్లాల్లో బీజేపీ పట్టు బాగా పెంచుకుంది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ సుభాష్ చౌహాన్ పార్టీ పట్టు పెరగడానికి కృషి చేశారు.తుపాను సమయంలో బీజేపీ నేతలు ఒక్కరూ కనిపించలేదు. కానీ ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి మొసలి కన్నీరు కారుస్తారన్న సెటైర్లు వినిపిస్తున్నాయ్.
ఇక ఒకప్పుడు బాగా పట్టు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయింది. రాహుల్ పలుమార్లు రాష్ట్ర పర్యటనలు చేసినా కార్యకర్తల్లో నైతిక స్థైర్యం పెరగడం లేదు. బిజు జనతాదళ్, బీజేపీపై నమ్మకం కోల్పోయిన అన్నదాతలు తమ పార్టీ వెంట నడుస్తారన్న ఆశలో ఉన్నారు. ఏమైనా మొత్తం మీద ఒడిశా రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే సీఎం నవీన్ పట్నాయక్ ఇమేజ్ చెక్కు చెదరలేదు. బీజేపీ క్షేత్రస్థాయిలో బలోపేతమైంది. సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ మళ్లీ తన ప్రాభవాన్ని చూపే ప్రయత్నం చేస్తోంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.