నోరు జారిన సాధ్వీ!.. ప్రగ్యాను మోడీ వెనుకేసుకొస్తున్నారా?

Update: 2019-04-21 11:48 GMT

వివాదాస్పద వ్యాఖ్యలతో సాధ్వీ ప్రగ్నా మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. హై ప్రొజెక్టివ్‌ హిందూయిస్టుగా పేరున్న ప్రగ్నా ముంబై దాడుల్లో అమరుడైన హేమంత్‌ కర్కరేపై నోరుపారేసుకొని ఇటు తనను వ్యక్తిగతంగా ఇబ్బందులు పాలు చేసుకోగా అటు పార్టీని ఇరుకున పెట్టేశారు. మొత్తంగా సాధ్వీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమా అంటూ ప్రతిపక్షాలతో పాటు సామాన్య జనం కూడా ప్రశ్నిస్తున్నారు.

ఇవీ ప్రగ్నాసింగ్‌ఠాకూర్‌ వ్యాఖ్యలు. ముంబై దాడిలో ఉగ్రమూకల దాడిలో కన్నుమూసిన హేమంత్‌కర్కరే తన శాపం వల్లే చనిపోయాడని ఆమె ఆవేదన చెప్పిన మాట. ఇందులో నిజానిజాల మాట పక్కనపెడితే ఒక సెన్సిటివ్‌ ఇష్యూని ఇలా సెన్సేషనలైజ్‌ చేయడమే అసలు వివాదానికి కారణం. కరుడుగట్టిన హిందూత్వవాదిగా పేరొందిన ప్రగ్నా మహారాష్ట్ర సర్కార్ కక్ష గట్టి వ్యవహరించిందని, చిత్రహింసలు పెట్టిందని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరేకు తన ఉసురే తగిలిందంటూ నోరుపారేసుకున్నారు.

అంతా అయ్యాక ప్రగ్నాకు చేసిన తప్పు తెలిసి వచ్చినట్టుంది. ఆవేశంలో మాట్లాడానని సర్దిచెప్పుకున్నారు. ఆ వ్యాఖ్యలు తనకు తానుగా చేసినవి కావంటూ ఆ భగవంతుడే తనతో అలా మాట్లాడించారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో కర్కరే సిన్సియర్‌ ఆఫీసర్‌ అంటూ కితాబిచ్చారు. సాధ్వీ సంచలన వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు పెరగడంతో సేఫ్‌ గేమ్‌ ప్లేచేసిన బీజేపీ తర్వాత రూటు మార్చుకుంది. సాక్షాత్తూ ప్రధాని మోడీ మాత్రం రంగంలోకి దిగారు. అనూహ్యంగా ఆమెకు మద్దతుగా నిలిచారు. హిందూ నాగ‌రిక‌త‌పై ఉగ్రవాదం మ‌చ్చ వేసిన కాంగ్రెస్ నేత‌ల‌కు ప్రగ్యానే స‌మాధానంగా నిలుస్తుంద‌ంటూ కౌంటర్‌ ఇచ్చారు. త‌ప్పుడు ప‌ద్ధతిలో హిందూ సంస్కృతిని కాంగ్రెస్ నేత‌లు కించ‌ప‌రిచారని ఎదురుదాడి చేశారు. సంజౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు, జ‌డ్జి బీహెచ్ లోయా మృతి లాంటి కేసుల‌ను బీజేపీకి అంట‌గ‌ట్టింద‌న్నారు ప్రధాని. అయితే, ప్రగ్యా సింగ్ వెనక్కి తగ్గినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం ప్రగ్యాను వెనుకేసుకురావడం చర్చనీయాంశంగా మారింది.

Similar News