సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి, శత్రు దేశాలను గడగడలాడించిన నరేంద్ర మోడీ, ఎన్నికల ముంగిట్లో స్వదేశంలోని ప్రత్యర్థి పార్టీలపై మెరుపు దాడి చేశారు. కులమనే బలమైన ఆయుధాన్ని ప్రయోగించారు. అగ్రవర్ణమనే పేరున్నా, అతుకులబొంతలా బతుకీడుస్తున్న పెద్ద కులాల్లోని పేదలకూ రిజర్వేషన్ కల్పిస్తూ, సంచలన, చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. విద్య, ఉద్యోగాల్లో వారికి పది శాతం కోటా ఇవ్వాలని తీర్మానించారు. బ్రహ్మణులు, రెడ్లు, వైశ్యులు, వెలమలు, కమ్మలు, ఇలా అప్పర్ క్యాస్ట్‌లోని పేదలకు న్యాయం జరగబోతోంది మోడీ నిర్ణయంతో. అయితే, మోడీ కోటా నిర్ణయాన్ని బీసీలు, ఎస్సీ, ఎస్టీ సంఘాలు తప్పుబడుతుంటే, ఇఫ్పుడే గుర్తొచ్చిందా అంటూ విపక్షాలు ఎన్నికల టైం కోట్ చేస్తున్నాయి. 50 శాతానికి రిజర్వేషన్లు మించకూడదని సుప్రీం కోర్టు రూలింగ్ ఉన్నా, కోటా పెంపు నిర్ణయంలో మోడీ ధైర్యమేంటి.
పేరుకే అగ్రకులాలు. కానీ అందులో కొన్ని కుటుంబాల జీవనం అస్తవ్యస్తం. పెద్ద కులం కావడంతో, రిజర్వేషన్లు రావు. రిజర్వేషన్లు 50 శాతం ఉండటంతో, మిగిలిన కోటాలో పోటీపడలేక సతమతం. అయితే ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం, కోటా నిర్ణయం తీసుకుంది. ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్‌లో టెన్ పర్సెంట్ కోటా ఇచ్చేసింది. పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చరిత్రాత్మక తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న కుల, మత ప్రాతిపదిక రిజర్వేషన్లు కాకుండా, ఆర్థిక వెనకబాటే గీటురాయిగా అగ్రకులాల పేదలకు కోటా కల్పించేందుకు సిద్దమైంది. ఎన్నికల ముంగిట్లో తమ సర్కారుపై రకరకాల విమర్శలు, వ్యతిరేకత పెరుగుతున్న టైంలో, వాటన్నింటినీ పక్కకునెనట్టేలా, దేశం ముందు సరికొత్త చర్చను పెట్టింది. ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా మోడీ సర్కారు భావిస్తున్నా...ఒకరకంగా మరోసారి రిజర్వేషన్ తేనేతుట్టేను కదిపినట్టయ్యింది.
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆమోద ముద్ర వేసింది కేంద్ర కేబినెట్. ఈ నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా,ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మోడీ సర్కార్ రాజ్యాంగ సవరణను చేపట్టబోతోంది. పార్లమెంట్ సమావేశాలు ముగియడానికి ఒకరోజుముందు, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. పార్లమెంట్‌లో రిజర్వేషన్ల బిల్లు పెడుతోంది. రాజ్యాంగ సవరణ చేయబోతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 16కు సవరణలు చేస్తారు.10 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన మోడీ ప్రభుత్వం, అందుకు విధివిధానాలు చేర్చి, కండీషన్లు అప్లై అని చెప్పింది. ఆ షరతులేంటంటే, వార్షికాదాయం 8 లక్షల్లోపు ఉండాలి. ఐదెకరాల కంటే ఎక్కువ పొలం ఉంటే రిజర్వేషన్లకు అనర్హులు. ఇంటిస్థలం 1000 చ. అడుగుల కంటే ఎక్కువుంటే వర్తించదు.
ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లున్నాయి. వాటిలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం ఉన్నాయి. మొత్తం రిజర్వేషన్లు 49.5 శాతం. తాజాగా ఈబీసీ రిజర్వేషన్లు 10 శాతం కల్పించడంతో, మొత్తం రిజర్వేషన్ల కోటా 59.5 శాతానికి పెరగబోతోంది. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఉంది. ఈ నేపథ్యంలో మోడీ సర్కారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందన్న విషయం ఆసక్తి కలిగిస్తోంది. వర్ణ వివక్ష, వర్గ వివక్ష, కుల వివక్షకు గురైనవారికి రిజర్వేన్లేది రాజ్యాంగ మూల సిద్దాంతం. విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యంలేని కులాలకు రిజర్వేషన్లని అంబేద్కర్ భావన. కేవలం పదేళ్లు మాత్రమే ఉండాలన్నారాయన. అయితే, రిజర్వేషన్లు రాజకీయ పార్టీల చేతుల్లో అస్త్రాలయ్యాయి. ఓటు బ్యాంకు రాజకీయాలయ్యాయి. రిజర్వేషన్లు ఎత్తేయండి, ప్రతిభను గుర్తించండని దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తోంది. మోడీ తీసుకున్న అగ్రవర్ణాల రిజర్వేషన్ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు ఇదొక కుట్రగా అభివర్ణించాయి. అగ్రకులాల్లోని పేదలను ఆదుకోవడం మంచిదే అయినా, సరిగ్గా ఎన్నికల టైంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నాయి.