దక్షిణాదిన కేరళ రాహుల్ ని రారమ్మని పిలుస్తోంది. ఈ ఎన్నికల్లో అమేథీతో పాటూ కేరళలోని వాయనాడ్ నుంచీ బరిలో దిగాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడిపై ఒత్తిడి పెరుగుతోంది. కేరళలో వాయనాడ్ పై కాంగ్రెస్ శ్రేణులకు ఎందుకంత గురి? ఆ స్థానం వ్యూహాత్మకంగా రాహుల్ కి ఎందుకు సురక్షితం?
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈఎన్నికల్లో రెండు నియోజక వర్గాలనుంచి పోటీ పడుతున్నారు.. ఇందులో ఒకటి అందరికీ తెలిసిన అమేథీ నియోజక వర్గం. మూడు దశాబ్దాల కాలంగా ఈ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిలుస్తోంది. అయితే మారిన రాజకీయ పరిణామాల కారణంగా అమేథీ ఆయనకు ఏ మాత్రం సురక్షితం కాదని తేలిపోయింది. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ అమేథీపై కన్నేసి రాహుల్ పై గెలుపు కోసం పోటీ పడుతున్నారు.. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఆమె అమేథీకి వెడుతూనే ఉన్నారు.. 67 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు ఆ నియోజక వర్గానికి తీసుకొచ్చారు. తనకు సంబంధం లేని నియోజక వర్గమే అయినా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. దీంతో అమేథీ ప్రజలు రాహుల్ కన్నా స్మృతీని ఇష్టపడటం మొదలు పెట్టారు. రాహుల్ ఈ నియోజక వర్గానికి ఏం చేయకపోయినా గాంధీల వారసుడిని గెలిపించుకోవడం తమ బాధ్యతగా ఇన్నాళ్లూ అక్కడి జనం భావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుుడు సీన్ మారిపోయింది.
అందుకే రాహుల్ మరో సీటు నుంచి కూడా పోటీ పడాలనుకుంటున్నారు. అదే కేరళలోని వాయనాడ్ ఇది ఆయనకు అత్యంత సురక్షితమైన స్థానంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ సీటును వామపక్షాల పై కాంగ్రెస్ అభ్యర్ధి షానవాజ్ గెలిచారు. దాంతో దక్షిణాదిన రాహుల్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తే మంచిదనే ఆలోచనలో కాంగ్రెస్ శ్రేణులున్నాయి.
2008లో డీలిమిటేషన్ పద్ధతిలో ఈ లోక్ సభ స్థానం ఏర్పడింది.ఉత్తర కేరళలో ఉన్న ఈ నియోజక వర్గం అటు తమిళనాడు, కర్ణాటక సరిహద్దులను పంచుకుంటోంది. వరుసగా కాంగ్రెస్ అభ్యర్ధే అక్కడ గెలుస్తూ వస్తున్నా, గతేడాది అనూహ్యంగా ఆ అభ్యర్ధి మరణించడంతో నియోజక వర్గం ఖాళీగా ఉంది. 2009 ఎన్నికల నాటికి వాయనాడ్ ఓటర్ల సంఖ్య11 లక్షల రెండువేల మంది. షానవాజ్ ఇక్కడ నాలుగు లక్షల ఓట్లతో గెలిచారు. ఇదే స్థానం నంచి పోటీ పడిన సీపీఐ అభ్యర్ధి రెండు లక్షల ఓట్లతో సరిపెట్టుకున్నారు.. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 31వేల ఓట్లు వచ్చాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మూడో స్థానంలో నిలవగా, బీజేపీ అభ్యర్ధి నాలుగో స్థానంలో నిలిచారు. నోటాకు పదివేల ఓట్లు పడ్డాయి. ఆప్ అభ్యర్ధికి మరో పదివేలు, ఇండిపెండెంట్ అభ్యర్ధికి 5 వేల ఓట్లు వచ్చాయి. వాయనాడ్ లో ప్రతీ ఎన్నికలోనూ బహుముఖ పోటీ కారణంగా ఓట్లు చీలి కాంగ్రెస్ అభ్యర్ధి గెలుస్తూ వస్తున్నాడు. వాయనాడ్ లోక్ సభ స్థానంలో ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లు ఉన్నాయి.
వీటిలో మూడు వాయనాడ్ జిల్లాలో ఉన్నాయి.మరొకటి కోజీకోడ్ లో ఉంది. మిగిలిన మూడు మలప్పరం జిల్లాలో ఉన్నాయి. వయనాడ్ నుంచి రాహుల్ ను బరిలోకి దింపితే దాని ప్రభావం దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ అభ్యర్ధులందరిపైనా ఉంటుందని, వారందరికీ బూస్టింగ్ ఇచ్చినట్లుంటుందని కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ అంటున్నారు. ఈ ప్రతిపాదనకు రాహుల్ అంగీకరించినట్లు, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారనీ తెలుస్తోంది. రాహుల్ ఇక్కడ నుంచి కనీసం అయిదు లక్షల మెజారిటీతో గెలుస్తారని మరో కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల అంటున్నారు. కేరళలో ఉన్న 20 ఎంపీ సీట్లలో కాంగ్రెస్, యూడీఎఫ్ కలసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 16 సీట్లు తీసుకోగా, మిత్రపక్షాలైన ఐయుఎంఎల్ రెండు, కేరళ కాంగ్రెస్, ఆర్ ఎస్ పీ, చెరోస్థానానికీ పోటీ పడుతున్నాయి. ఒక్క వయనాడ్ ను మినహాయిస్తే మిగతా అన్ని సీట్లకు అభ్యర్ధుల ఎంపిక కూడా పూర్తయిపోయింది. ఏడు దశలలో జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేరళ మూడవ దశలో అంటే ఏప్రిల్ 23న ఎన్నికలకు వెడుతోంది.
రాహుల్ ఈ స్థానం నుంచి పోటీకి అంగీకరిస్తే ఆయన గాంధీ కుటుంబం నుంచి దక్షిణాదిన బరిలో నిలిచిన మూడో తరం వ్యక్తిగా మిగులుతారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత కర్ణాటకలోని చిక్మగళూర్ నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. ఇక సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్లారి నుంచి ప్రత్యర్ధి సుష్మా స్వరాజ్ పై అఖండ మెజారిటీతో గెలిచారు. రాహుల్ రెండో సీట్ ఏదైనా మొదటి స్థానం మాత్రం కర్మభూమి అమేథీయేనంటున్నారు కాంగ్రెస్ పెద్దలు.