విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు దీక్షకు సిద్ధమయ్యారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు ఆయన కాసేపట్లో దీక్షకు దిగనున్నారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లా కేంద్రాల్లో ధర్మ పోరాట దీక్షలు నిర్వహించి కేంద్ర వైఖరిని ప్రజలకు వివరించిన చంద్రబాబు ... .. దేశ రాజధానిలో ప్రధాని మోడీ టార్గెట్‌గా విమర్శలకు పదును పెట్టనున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు దీక్షకు పలు జాతీయ పార్టీలు మద్దతు పలకనున్నాయి.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ ఢిల్లీ వీధులు గర్జిస్తున్నాయి. విభజన హామీల అమలు ఎప్పుడంటూ అడుగుకో ఆంధ్రుడు నినదిస్తున్నాడు. ఏపీకి ఏమిచ్చారో చెప్పాలంటూ ఇంటికో యువకుడు ప్రధానిని ప్రశ్నిస్తున్నాడు. ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో పాల్గొనేందుకు వందలాది మంది ఉద్యోగులు వేలాది మంది కార్యకర్తలు, నేతలు, అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు, హోదా సాధాన సమితి సంఘాల నేతలు ఢిల్లీ చేరుకున్నారు. పునర్విభజన చట్ట హామీల అమలులో.. జరుగుతున్న అన్యాయాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాన దీక్షా వేదిక దగ్గర పబ్లిక్ అడ్రస్ సిస్టం, పోలీసు రక్షణ వలయం, మంచినీటి సరఫరా, మీడియా లాంజ్, ప్రత్యక్ష ప్రసారాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రే ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు ఏపీ భవన్‌కు చేరుకుని పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. కాసేపట్లో రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి నివాళులు అర్పించిన అనంతరం ... 8 గంటల నుంచి దీక్ష ప్రారంభించనున్నారు. రాత్రి ఎనిమిది గంటల వరకు చంద్రబాబు దీక్షలో పాల్గొనున్నారు. బాబు దీక్షకు సంఘీభావంగా జాతీయ, పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు సంఘీభావం తెలపనున్నారు.
దీక్ష ద్వారా ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశ వ్యాప్తంగా వినిపించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. విభజన హామీల అమలులో నాలుగున్నరేళ్లుగా చూపుతున్న వివక్షను ఆయన ఎండగట్టనున్నారు. ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాల పరిధిలో ధర్మపోరాట దీక్షలతో ప్రజలను ఏకం చేసిన చంద్రబాబు ... జాతీయ స్ధాయిలో మద్దతు కూడగట్టేందుకు ఈ రోజు దీక్ష చేయున్నారు. ధర్మపోరాట దీక్ష ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నేతలతో పాటు పార్లమెంట్ సభ‌్యులు , రాష్ట్ర మంత్రులు స్వయంగా పర్యవేక్షించారు. దీక్షలో పాల్గొనేందుకు వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నేతలు వివరించారు. ఢిల్లీ వేదికంగా నిర్వహిస్తున్నఈ దీక్షతో తెలుగోడి సత్తా చాటుతామంటున్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. ప్రధాని మోడీ అసత్యాలు చెప్తూ తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ఇక ధర్మ పోరాట దీక్ష ప్రభుత్వ ఖర్చుతో చేయడం తప్పేమీ కాదన్నారు ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాశ్. దీక్షకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా 8 వందల హోటల్ గదులను, 40 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. దీక్ష స్థలం దగ్గరే ఫుడ్ కోర్టులు అన్నీ ఏర్పాటు చేశామని తెలిపారు.
చంద్రబాబు ధర్మపోరాట దీక్ష సందర్భంగా ఏపీ భవన్ పరిసర ప్రాంతాలు ఫ్లెక్సీలు, హోర్డింగులతో నిండిపోయాయి. వీ వాంట్ జస్టిస్, ద స్ట్రగుల్ ఫర్ జస్టిస్, కడపలో స్టీల్ ప్లాంట్ ఎక్కడంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరో వైపు భారీగా తరలివచ్చిన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏపీ భవన్‌లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.