ఎన్నికలు అంటేనే చాలా హంగామా. రాజకీయపక్షాలకి జీవన్మరణ సమస్య. ఒక్కసారి పడిన ఓటు ఐదేళ్ల అధికారానికి మెట్టు. ఒక్క ఓటే కదా అని లెక్కలేకుండా చూస్తే లెక్కల్లోకి లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఎన్నికల రోజు ప్రజల్ని, తమ మద్దతు దారులను ఓటింగ్ కు తీసుకు వచ్చి ఓటు వేశేలా చూసుకోవడం ఇవన్నీ ఒకెత్తు.. ఓట్ల లెక్కింపు మారో ఎత్తు. వేలాది ఓట్లను లెక్కించే క్రమం లో ఎక్కడ ఏ పొరపాటు జరిగినా గెలిచే సీటు కూడా ఓటమికి జై అంటుంది. వేయికళ్లతో ఒక్క ఓటు కూడా లెక్కలోంచి తప్పిపోకుండా చోసుకుపోవాల్సిందే. ఒకే ఓటు తలరాతను మార్చిన సందర్భాలు కోకొల్లలు.
ఈ ఎన్నికల్లో ఓడిన పార్టీ మళ్ళీ ఎన్నికలదాకా బతికి బట్టకట్టే ఛాన్స్ కనిపించడం లేదు. ఆపరేషన్ ఆకర్ష్ పథకం ఓడిన పార్టీలోని గెలిచినా ఎమ్మెల్యేలకు గోడ దూకించడానికి సిద్ధంగా ఉంది. గత ఎన్నికల తరువాత 23 మంది వైఎస్సాఆర్సీపీ ఎమ్మెల్యేలు జంపయిపోయి తెలుగుదేశానికి జై కొట్టారు. తెలంగాణలో ఇటీవలి ఎన్నికల తరువాత కాంగ్రెస్, టీడీపీ పూర్తిస్థాయిలో బోర్డు తిప్పేసే పరిస్థితి ఏర్పడింది. ఈ లెక్కల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ గెలిచినా అవతలి పక్షాన్ని నిలబడనీయదనే వాదన బాగా వినిపిస్తోంది.
అందుకే, ప్రతిష్టాత్మకంగా, పెను సవాలుగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పై ఆంద్ర ప్రదేశ్ లో ప్రధాన పార్టీల నాయకులు కౌంటింగ్ ప్రక్రియపై కసరత్తులు చేస్తున్నారు. కౌంటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ అప్రమత్తమవుతున్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి పొరబాట్లకు తావివ్వకుండా ఉండేందుకు వీలుగా తమ ఏజెంట్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ రాష్టంలో పలు చోట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. దానిని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ కూడా విజయవాడలో శిక్షణ ప్రారంభించింది.
ఏపీలో గెలుపుపై టీడీపీ, వైసీపీ ఇరుపార్టీలు భారీ ఆశలే పెట్టుకున్నా.. చివరి నిమిషం వరకూ అప్రమత్తంగా లేకపోతే ప్రత్యర్ధి పార్టీ దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుందన్న ఆందోళన వారిలో పెరిగిపోతోంది. దీంతో కౌంటింగ్ కు సంబంధించి ఏజెంట్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ బ్యూరోకాట్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. విజయవాడలో ప్రారంభమైన వైసీపీ ఏజెంట్ల కౌంటింగ్ శిక్షణకు మాజీ సీఎస్ అజేయకల్లం, ఐఏఎస్ అధికారి శామ్యూల్ హాజరు కావడాన్ని బట్టి చూస్తే ఆ పార్టీ కౌంటింగ్ ను ఎంత సీరియస్ గా తీసుకుందో అర్ధమవుతోంది.