ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ ని కష్టాలు ఒక్కసారిగా వెంటాడుతున్నాయా?ఓవైపు సిటిజన్ షిప్ వివాదం మరోవైపు సుప్రీం కోర్టు చీవాట్లు ఒకేసారి రావడంతో కాంగ్రెస్ కలవరపడుతోంది. అయితే తానెవరికీ భయపడేది లేదని, తానే తప్పు చేయలేదంటున్నారు రాహుల్ అయిదవ దశ పోలింగ్ మొదలవుతున్న నేపధ్యంలో కావాలనే బీజేపీ రచ్చ చేస్తోందన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కష్టాలు ఒక్కసారిగా వెంటాడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్ మోడీపై వేసిన పంచ్ లు కాస్తా.. వికటించి ఆయనకే తలనొప్పులు తెచ్చాయి. రాఫేల్ డీల్ అంతా మోసమేనని ఆరోపిస్తూ వచ్చిన రాహుల్ మోడీ చౌకీదార్ నినాదాన్ని తీవ్రంగా తిప్పికొట్టారు రాఫేల్ డీల్ పై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టడాన్ని సాకుగా తీసుకుని కోర్టు సైతం తన ఆరోపణలను సమర్ధించిందని చౌకీదార్ చోర్ హై నినాదానికి మద్దతు తెలిపిందనీ రాహుల్ కామెంట్ చేశారు. ఈ కామెంట్లను సాకుగా తీసుకుని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షీ లేఖీ రాహుల్ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కేసు వేశారు.
రాహుల్ చేసిన కామెంట్లపై మండి పడిన కోర్టు ఆయనకు చీవాట్లు పెట్టింది. తమ కామెంట్లను రాజకీయ అవసరాలకు ఎలా వాడుకుంటారంటూ నిలదీసింది. దాంతో తాను పొరపాటున కామెంట్ చేశానని రాహుల్ సారీ చెప్పారు. అయితే లిఖిత పూర్వకంగా కోర్టుకు క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ కఠినమైన సంకేతాలు పంపింది కోర్టు దాంతో రాహుల్ తాను పొరపాటునే కోర్టు వ్యాఖ్యలను వక్రీకరించానని అందుకు చింతిస్తున్నాననీ తెలిపారు. రాహుల్ తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ.. రాహుల్ ఇప్పటికే సారీ చెప్పారంటూ వివరణ ఇచ్చారు. సింఘ్వీపై మండిపడిన కోర్టు సారీ చెప్పే తీరు ఇదేనా అని నిలదీసింది. మరోసారి స్పష్టమైన వివరణతో క్షమాపణల అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోవైపు రాహుల్ పౌరసత్వంపైనా బీజేపీ రచ్చ చేస్తోంది. ఆయనఅసలు పేరు రాహుల్ విన్సీ అనీ బ్రిటన్ లో ఓ కంపెనీకి భాగస్వామి అని అక్కడ పౌరసత్వం కూడా ఉందని బీజేపీ ఆరోపించింది. దీనికి మద్దతుగా హోం శాఖ రాహుల్ పౌరసత్వంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణల ఆధారంగా వివరణ కోరిన కేంద్రం 15 రోజులు గడువిచ్చింది. మరోవైపు రాహుల్ పుట్టి, పెరిగింది ఇక్కడేనని ముమ్మాటికీ భారతీయ పౌరుడేనని అంటున్నారు ప్రియాంక. ఇవి కుట్ర పూరితంగా చేస్తున్న ఆరోపణలేనని అమేథీలో పోలింగ్ జరుగుతున్న తరుణంలో కావాలనే బీజేపీ ఈఎత్తుగడలకు పాల్పడిందని ఆరోపించారు ప్రియాంక.