కమల్‌ వర్సెస్‌ కమలం 'మధ్య'లో మురిసేదెవరు?

Update: 2019-04-19 17:45 GMT

హిందూత్వవాదం, ఓబీసీల అండ, రైతన్నల బాసట మధ్యప్రదేశ్‌లో బీజేపీకి దీర్ఘకాలం శ్రీరామరక్షగా నిలిచిన అంశాలు. రాష్ట్రంలో 15 ఏళ్లపాటు పార్టీ ప్రభుత్వం కొనసాగడంలో ఇవే కీలక పాత్ర పోషించాయి కూడా. ఇప్పుడు వాటినే తమ అస్త్రాలుగా చేసుకొని కమలం రెక్కలు తీసేయాలని చూస్తోంది కాంగ్రెస్‌. గో వధను సహింపబోమని, పంట రుణాలు మాఫీ చేస్తామని గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేస్తూ ముందుకెళ్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ హస్తం పార్టీ కమలనాథులతో హోరాహోరీ తలపడుతోంది. ఈ పోరులో అసలు విజేత ఎవరు?

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ గోవుల రక్షణకు సంబంధించి కీలక హామీలిచ్చింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక గో సంరక్షణశాలను ఏర్పాటు చేస్తామని, గోవధకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. చాలామంది ఆ హామీలను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మధ్యప్రదేశ్‌ జనాభాలో 7 శాతం మంది ముస్లింలు. గో వధపై ఉక్కుపాదం మోపితే వారి ఓట్లు దూరమయ్యే అవకాశముందని పార్టీకి తెలుసునని, కాబట్టి అధికారంలోకి వచ్చాక సంబంధిత హామీలను కాగితాలకే పరిమితం చేస్తుందని భావించారు. వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలుపై దృష్టిసారించింది. గోవధ కేసులో ముగ్గురు నిందితులపై ఖండ్వాలో జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి సంచలనం సృష్టించింది.

రాష్ట్రంలో భాజపాకు అత్యంత విశ్వాసపాత్ర ఓటు బ్యాంకు ఓబీసీలు. వారిని తమవైపునకు తిప్పుకునేందుకు సీఎం కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రిజర్వేషన్‌ అస్త్రాన్ని ప్రయోగించింది. ఓబీసీల రిజర్వేషన్‌ను 14% నుంచి 27%కు పెంచింది. రాష్ట్ర జనాభాలో 45 శాతానికిపైగా ఓబీసీలే కావడంతో కమలనాథులకు ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఓబీసీల్లో ఆదరణ ఉన్న నాయకుడు కావడంతో ఆయనపై వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లకుండా కాంగ్రెస్‌ జాగ్రత్త పడుతోంది.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దారుణ పరాజయమేమీ ఎదురవ్వలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 40.9% ఓట్లు దక్కించుకోగా, కమలనాథులకు 41% ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన కమలం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించాలి. ఇక మధ్యప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీజేపీ అధినాయకత్వం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ కల్పించడం వంటి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అగ్రవర్ణాల మద్దతు దక్కించుకోవడమే లక్ష్యంగా గోపాల్‌ భార్గవ్‌ను మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమించింది. ఇవన్నీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి కలిసొచ్చే అంశాలని పలువురు విశ్లేషిస్తున్నారు.

Similar News