కులాల కురుక్షేత్రంలో కమలం వికాసమెంత...? ముదిరిన వ్యవసాయ సంక్షోభాన్ని హస్తరేఖలు సరిచేయగలవా? అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భిన్న తీర్పిచ్చే ఎడారి రాష్ట్రం ఇప్పుడేమనుకుంటుంది.? రెండు దశాబ్దాలుగా లోక్‌సభ ఎన్నికల కంటే ఆరు నెలల ముందే రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీయే లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు దక్కించుకోవడం ఒక సెంటిమెంట్. ఈసారి అదే సంప్రదాయం కొనసాగుతుందా? అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఎజెండాలే వేర్వేరు అనే అవగాహన ఓటర్లలో పెరిగిందా?
గత లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ హవాతో రాజస్థాన్‌లో కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 25 స్థానాల్లో జయకేతనం ఎగుర వేసి రికార్డు సృష్టించింది. కానీ 2018 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వసుంధరా రాజె వ్యవహార శైలిపై నెలకొన్న అసమ్మతి బీజేపీ పుట్టి ముంచింది. 200 అసెంబ్లీ స్థానాలకు 73 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, కాంగ్రెస్.. మ్యాజిక్ ఫిగర్‌కి ఒక్క సీటు దూరంలో ఆగిపోయి వంద సీట్లు మాత్రమే దక్కించుకుంది. సాధారణంగా రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావమే లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపిస్తుంటుంది. కానీ ఈసారి అలాంటి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. అలాగని గత లోక్‌సభ ఎన్నికల మాదిరిగా బీజేపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితీ లేదు.
రాజస్థాన్‌లో కులసమీకరణలే కీలకంగా మారనున్నాయి. ఇక్కడ ఓటర్లలో గుజ్జర్లు తొమ్మిది శాతం ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజ్జర్లకు చెందిన సచిన్ పైలెట్‌కి బదులుగా మాలీ సామాజిక వర్గానికి చెందిన అశోక్ గహ్లోత్‌ను సీఎంను చేయడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఎస్టీ హోదా కోసం వారు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఈసారి గుజ్జర్లు ఎటు వైపు నడిస్తే... వారికే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక మరో ప్రధానమైన సామాజిక వర్గం రాజపుత్రులు. వీరు జనాభాలో పది శాతం. వసుంధరా రాజెపై వ్యతిరేకతతో అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా కాంగ్రెస్‌కే ఓటేశారు. దక్షిణ రాజస్థాన్‌లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన భిల్‌లు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ సామాజిక వర్గం ఓట్లపై ఆర్‌ఎస్‌ఎస్ పెద్దగా దృష్టి సారించలేదు. మొత్తమ్మీద కుల సమీకరణలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టే కనిపిస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. మాజీ సీఎం వసుంధరా రాజెకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలి పదవి కట్టబెట్టి ఆమె స్థానాన్ని పరిమితం చేశారు. మోడీ, అమిత్‌షాతో సత్సంబంధాలు లేని వసుంధర రాష్ట్ర స్థాయిలో బీజేపీ బలోపేతానికి, ఎన్నికల ప్రచారానికి ఒక ఊపు తీసుకురావడానికి ఏమీ చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఈ అంశంలో కాంగ్రెస్ కాస్త నయంగానే కనిపిస్తుంది. సీఎం అశోక్ గహ్లోత్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ కలసికట్టుగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే స్థానిక నాయకుల్లో సమన్వయం కొరవడడం కాంగ్రెస్‌కు సమస్యగా మారింది.
ఇక రాజస్థాన్ అంటేనే ఎన్నికల బెట్టింగ్‌లకు మారు పేరు. ఇక్కడ సట్టా మార్కెట్‌లో గెలుపు గుర్రాలపై పందేలు జోరుగా సాగుతుంటాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా అంతర్గతంగా చేయించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మొత్తమ్మీద చూస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ పై చేయి సాధించవచ్చు కానీ, గత ఎన్నికలతో పోలిస్తే చాలా సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఆ నష్టాన్ని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.