అయోధ్యలో వివాదం అంతా కూడా 2.77 ఎకరాల స్థలంపైనే. అందులోనూ కూల్చివేతకు గురైన కట్టడం ఉన్నది దాదాపు మూడో వంతు ఎకరం స్థలంలోనే. ఆ వివాదం అలా కొనసాగుతుండగానే తాజాగా మరో వివాదానికి కేంద్రం తెర తీసింది. వివాద స్థలానికి చేరువలోని 67 ఎకరాల భూమిని ఆలయ నిర్మాణం కోసం రామ్ జన్మభూమి న్యాస్ కు అప్పగించేందుకు అనుమతించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. రానున్న ఎన్నికల్లో కమల వికాసంపై సందేహాలు తలెత్తడంతో.....బీజేపీ తన అమ్ముల పొదిలోనుంచి రామాలయ నిర్మాణ అస్త్రాన్ని మరోసారి సంధిస్తోంది. కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడిన ఈ అస్త్రం ఎంత వరకు విజయం సాధిస్తుందన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
లోక సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఒక్కొక్క అస్త్రాన్నే ప్రయోగిచండం ప్రారంభించాయి. పేదలకు రిజర్వేషన్లతో బీజేపీ సంచలనం కలిగించింది. దానికి దీటుగా అన్నట్లుగా కాంగ్రెస్ కనీస ఆదాయ పథకాన్ని ప్రకటించింది. ఇక తాజాగా బీజేపీ రామాలయ నిర్మాణ అస్ర్తాన్ని ప్రయోగించింది. దీన్ని ఎదుర్కోవడం మాత్రం కాంగ్రెస్ కు అంత సులభం కాదు. అదే సమయంలో ఆలయ నిర్మాణ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళడం బీజేపీ కి కూడా అంత తేలికేం కాదు. దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులు బీజేపీకి అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఆ అడ్డంకులను తొలగించుకోవడంలో భాగంగా బీజేపీ ఒక్కొక్క అడుగు ముందుకేస్తోంది. అందులో భాగమే సుప్రీం కోర్టుకు చేసిన తాజా అభ్యర్థన. వివాద స్థలం చుట్టూరా ఉన్న స్థలాన్ని రామ్ జన్మభూమి న్యాస్ కు బదలాయించేందుకు కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టు అనుమతి కోరింది. ఇందులోనూ అనేక చిక్కులున్నాయి. అసలు కొన్నేళ్ళుగా మరుగున పడిన ఈ అస్త్రాన్ని ఇప్పుడే ఎందుకు బయటకు తీయాల్సి వచ్చిందన్నది కూడా ప్రధాన ప్రశ్నగా మారింది.
మోడీ, అమిత్ షా ద్వయం కేంద్రంలో బీజేపీకి అధికారం దక్కేలా చూడడంలో కీలకపాత్ర పోషించారు. తదనంతరం మాత్రం బీజేపీ వరుస పరాజయాలను చవిచూసింది. ఒక దశలో సంఘ్ పరివార్ నే ధిక్కరించగలిగే స్థాయికి చేరుకున్న మోడీ, అమిత్ షా..... ఆ తరువాత మాత్రం సంఘ్ పరివార్ ఒత్తిళ్ళకు తలొగ్గే పరిస్థితి ఏర్పడింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడింది. ఆ వివాదాన్ని ఇక ఎక్కువ కాలం సాగదీయడం మంచిది కాదని సంఘ్ పరివార్ భావిస్తోంది. మరో వైపున బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం న్యాయస్థానాల నుంచి స్పష్టమైన తీర్పులు లేనిదే ఏం చేయలేని పరిస్థితిలో పడింది. అందుకే సంఘ్ పరివార్ ఒత్తిళ్ళు ఎక్కువైనప్పటికీ, కేంద్రప్రభుత్వం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నది. వివాద స్థలం చుట్టూరా ఉన్న 67 ఎకరాల భూమిని రామ్ జన్మభూమి న్యాస్ కు అప్పగించేందుకు సుప్రీం కోర్టు అనుమతి కోరడం ఇందులో భాగమే. ఈ స్థలం, దానిలో ఉన్న నిర్మాణాలపై ఎలాంటి వివాదం లేదనే అంశాన్ని కూడా కేంద్రప్రభుత్వం ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పును కూడా కేంద్రప్రభుత్వం ఈ సందర్భంగా ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం గనుక స్వాధీనం చేసుకున్న స్థలాన్ని వాస్తవ యజమానులకు తిరిగి ఇవ్వదలుచుకుంటే ఆ పని చేయవచ్చని ఆ తీర్పులో న్యాయమూర్తి స్పష్టం చేశారు. అప్పట్లో స్వాధీనం చేసుకున్న స్థలంలో రామ జన్మభూమి న్యాస్ కు చెందిన సుమారు 42 ఎకరాల స్థలం కూడా ఉంది.
1992లో వివాద స్థలం కట్టడం కూల్చివేత అనంతరం చోటు చేసుకున్న హింసాకాండలో సుమారు 2,000 మంది మరణించారు. దీంతో వివాద స్థలంలో, చుట్టూరా ఉన్న స్థలంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని, యధాతథ పరిస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా కేంద్రం చేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు అనుమతిస్తే, అక్కడ రామాలయ నిర్మాణం ప్రారంభమవుతుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ముస్లిం నాయకులు మాత్రం కేంద్రప్రభుత్వ అభ్యర్థనపై విమర్శలు చేస్తున్నారు.