'అవధ్‌' ఎవరిది..?

Update: 2019-04-30 06:59 GMT

2019 సార్వత్రిక ఎన్నికలలో గెలిచి కేంద్రంలో గద్దెనెక్కాలంటే యూపీలో ప్రతీ ఓటు, సీటు కీలకమే. యూపీని గెలవాలంటే కీలకమైన కొన్ని ప్రాంతాల్లో గెలిచి తీరాల్సిందే. అలాంటి ప్రాంతాల్లో కీలకమైన అవధ్ ప్రదేశ్ ఒకటి. గత ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు కట్టెబెట్టిన ఈ ప్రాంతం ఈ ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తుంది?లెటజ్ వాచ్ ది సీన్..

ఉత్తర ప్రదేశ్ లోని అవధ్ ప్రాంతానికో ప్రత్యేకత ఉంది. చారిత్రాత్మకంగా ఈ ప్రాంతానికి గుర్తింపు ఉంది. 17 లోక్ సభ నియోజక వర్గాలు కలిగిన ఈ ప్రాంతం నుంచి ప్రతీ ఎన్నికల్లోనూ ప్రముఖులో బరిలో నిలుస్తారు..అవధ్ ప్రాంతం ఇప్పటి వరకూ ముగ్గురు ప్రధానులను అందించింది. ఈ ప్రాంతం పరిధిలో ఉండే రాయబరేలి నియోజక వర్గం నుంచి గతంలో ఇందిర గెలిచారు. ఇక ఫతేపూర్ నుంచి వీపీ సింగ్ నిలబడి గెలిచారు. అటల్జీ ప్రాతినిధ్యం వహించిన లక్నో కూడా ఈ ప్రాంతం కిందకే వస్తుంది. అందుకే యూపీలో అవధ్ కు మంచి ప్రాముఖ్యత ఉంది.2014 ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 17 సీట్లకు 15 సీట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి.భారియా నుంచి బీజేపీ టిక్కెట్ తో గెలిచిన సావిత్రీ బాయ్ పులే ఆ తర్వాత కాంగ్రెస్ కు మారిపోయారు. దాంతో బీజేపీ ఇరకాటంలో పడింది. ఈ నేపధ్యంలోనే అవధ్ లో మెజారిటీ సీట్లను నిలబెట్టుకోవడం బీజేపీకి అంత సులభం కాదు.

అవధ్ జనాభా మొత్తం 3 కోట్లు. ఇక్కడ ఖేరీ, సీతాపూర్, లక్నో, ఫైజాబాద్, రాయబరేలీ, అమేథీ , బారాబంకి, ధౌరాహ్ర, మిస్రిక్, సుల్తాన్ పూర్, హర్దోయ్, భరియా, కైసర్ గంజ్, శ్రవస్తి, గోండా, అంబేద్కర్ నగర్, మోహన్ లాల్ గంజ్ స్థానాలున్నాయి. వీటిలో అయిదు స్థానాలు షెడ్యూల్డు కులాలకు రిజర్వు అయ్యాయి. అవధ్ వీఐపీ నియోజక వర్గాలకు నెలవైన ప్రాంతం..కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లక్నో నుంచి బరిలో ఉండగా రాయబరేలీ నుంచి సోనియా, అమేథీ నుంచి రాహుల్ గాంధీ, సుల్తాన్ పూర్ నుంచి వరుణ్ గాంధీ పోటీలో నిలిచారు.

రాహుల్ గాంధీపై పోటీకి ఈసారి కూడా బీజేపీ స్మృతీ ఇరానీనే రంగంలోకి దించడంతో ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్లుగా మారింది. రాహుల్ ను ఓడించడానికి బీజేపీ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. లక్నోలో ఈసారి రాజ్ నాథ్ సింగ్ పై కాంగ్రెస్ నుంచి ఆచార్యప్రమోద కృష‌్ణమ్ తలపడుతున్నారు. లక్నో నుంచి గతంలో మాజీ ప్రధాని వాజపేయి పోటీలో నిలవడంతో ఇది విఐపీ నియోజక వర్గంగా మారిపోయింది. ఎస్పీ, బీఎస్పీ కూటమి అయిన ఘట్ బంధన్ కు, కాంగ్రెస్, బీజేపీ లకీ అవధ్ లో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ యూపీ తుర్పు వ్యవహారాల ఇన్చార్జ్ ప్రియాంకా వాద్రా అందుకే ఈ ప్రాంతంలోని అయోధ్యను సందర్శించి తన అన్న, తల్లి నియోజక వర్గాల్లో ముమ్మర ప్రచారం మొదలు పెట్టారు.

ఓట్ల పరంగా, సీట్ల పరంగా అవధ్ చాలా కీలకమైన ప్రాంతం. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఇతర కులాలు, మైనారిటీలు, పేద ప్రజలు, రైతులు, కార్మికులు, మహిళలు ఇలా భిన్న వర్గాల ఓటర్ల సమాహారమైన అవధ్ లో ఈసారి ఫలితాలెలా ఉంటాయన్న అంశంపై అన్ని రాజకీయ పార్టీలకూ ఆసక్తి ఉంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న పట్టుదలా ఇక్కడ కొన్ని వర్గాల్లో గట్టిగా ఉంది.కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ ఇచ్చిన హామీలేవీ నిలబెట్టుకోలేదన్న విమర్శలున్నాయి.

దీనికి తోడు ఈ మధ్యమారిన రాజకీయ సమీకరణలు ఇక్కడి పోటీని కీలకంగా మార్చేశాయి. ఎస్పీ, బీఎస్పీ మహాఘట్ బంధన్ ఇక్కడి రాజకీయ సమీకరణలనే మార్చేసింది. ఈ కూటమి 60 సీట్లలో చాలా బలంగా ఉంది.. ఇక మిగిలిన ప్రాంతాల్లో ఈ కూటమి అభ్యర్ధులు బీజేపీకి చుక్కలు చూపించడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈసారి తమకు పట్టు లేని ప్రాంతాల్లో సైతం జయకేతనం ఎగుర వేయడం ఖాయమని సమాజ్ వాదీ పార్టీ ధీమా కనపరుస్తోంది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, యువతకు ఉపాధి చూపుతామని, మహిళలకు భద్రత కల్పిస్తామని, విద్యార్ధులకు నాణ్యమైన విద్య నందిస్తా మని ఆరోగ్య సేవలు విస్తరిస్తామనీ మహాఘట్ బంధన్ మేనిఫెస్టో వాగ్దానం చేసింది.

అవధ్ లో గెలుపుకు స్థానికాంశాలు కీలకంగా మారాయి. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత ఎన్నికల్లో చేసిన హామీలు నిలబెట్టుకోలేదన్నది బీజేపీపై రేగుతున్న ఆరోపణ కాగా, కుల, మత, వర్గ, వర్ణ ప్రాతిపదికన ఓట్లు పడే ప్రాంతం కావడంతో అవధ్ ఎవరి సొంత మవుతుందన్నది సస్పెన్స్ కలిగిస్తోంది. అయిదోదశ పోలింగ్ లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఈసారి ఎన్నికల్లో అవధ్ ఎవరి పరమవుతుందన్న అంశంపై లెక్కలేనన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రతీ పార్టీకి ఇక్కడి ఓట్లు, సీట్లు కీలకంగా మారుతున్నాయి. యూపిని గెలవాలంటే అవధ్ లో గెలుపు ప్రతిష్టాత్మకంగా, ఒక కొలమానంగా మారింది. గతంలో రాజకీయ పార్టీలు ఒకరి నొకరు గౌరవించుకుంటూ లక్నో, అమేథీ లాంటి కీలక నియోజక వర్గాల్లో పోటీకి అభ్యర్ధులను పెట్ట కుండా అవగాహనతో కొనసాగేవి అలాగే ఈసారి కూడా మహాఘట్ బంధన్ కు అనుకూలంగా కాంగ్రెస్ కొన్ని కీలక స్థానాలలో అభ్యర్ధులను పోటీకి పెట్ట లేదు. అలాగే ఘట్ బంధన్ కూటమి అమేథీ, రాయబరేలీలో తమ అభ్యర్ధులను నిలబెట్టలేదు. కానీ బీజేపీ మాత్రం సర్వ శక్తులు ఒడ్డి అమేథీలో గెలుపు కోసం పోరాడుతోంది. అవధ్ ను పట్టి పీడిస్తున్న అంశం పంటల ధ్వంసం క్రూర మృగాలు పంటలను నాశనం చేస్తుండటంతో రైతులే తమ పొలాల్లో కూలీలుగా, వాచ్ మన్ లుగా మారిపోయారని స్థానికులు అంటున్నారు.

ఇక యూపీ రాజధాని లక్నో ప్రభుత్వానికే కాదు అనేక పార్టీలకు కీలకమైన స్థానంగా నిలిచింది. అవధ్ ప్రాంతం యూపీకి గుండె కాయ లాంటిది. వివాదాస్పద రామాలయం కూడా ఈ ప్రాంతం లోనిదే.. భారత రాజకీయాలను ఇప్పటికీ ప్రభావితం చేసే అంశం రామజన్మభూమి వివాదం. దశాబ్దాలుగా రామాలయ వివాదం కేంద్రంగా రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో రామ మందిర నిర్మాణం ఎజెండాగానే బీజేపీ గెలుపు సొంతం చేసుకుంది.

అవధ్ రాజకీయంగా, సామాజికంగా చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడ పట్టణ, గ్రామీణ ఓటర్లు కలగలసి ఉంటారు. అమేధీ, దౌరార్హ లాంటి రాజకీయ ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలుండటంతో రాజకీయంగా కూడా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్, బీజేపీ అవధ్ ప్రాంతంలో గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఎందుకంటే అమేథీ , రాయబరేలి కాంగ్రెస్ కంచుకోటలు కాగా లక్నో బీజేపీ కంచుకోట..అందుకే ఈ సమరం ప్రధాన రాజకీయపార్టీలు రెంటికీ కీలకమైనది.

ఇక లక్నోలో గెలుపు కోసం బీజేపీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అది వాజపేయి ప్రాతినిధ్యం వహించి స్థానం కాగా.. వాజపేయి మరణం తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడం స్థానిక ఓటర్లలో సానుభూతిని పెంచే అంశం. కాబట్టి రాజ్ నాథ్ గెలుపుపై బీజేపీ ధీమాగా ఉంది. మరోవైపు మహా ఘట్ బంధన్ ఇక్కడ నుంచి శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హాను రంగంలోకి దింపింది. కాయస్త కులస్తుల ఓట్లు, సింధీల ఓట్లూ గెలుపును నిర్దేశించే అంశాలుగా మారతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ బరిలో ఉన్నారు. ఆయన లక్నో బరిలో నిలవడం కాంగ్రెస్ కూడా హిందూ ఓట్లను టార్గెట్ చేసిందనడానికి నిదర్శనం..యూపీలోని సంభాల్ జిల్లా కల్కి పీఠం గురువైన ప్రమోద్ 2014లోనే కాంగ్రెస్ లో చేరి సంభాల్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేశారు. ఈసారి లక్నోలో హిందూ ఓట్లను చీల్చడానికి కాంగ్రెస్ ప్రమోద్ కృ‌ష్ణమ్ ను బరిలోకి దించింది.

ఇక హిందూ ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్న బీజేపీ దీపోత్సవ్ ను ఘనంగా నిర్వహించడం, ఫైజాబాద్ పేరును అయోధ్యగా మార్చడం తమకు అనుకూలించే అంశాలని అంచనా వేస్తోంది. ఉన్నావ్ లంటి నియోజక వర్గాల్లో గెలుపు ఏకపక్షం అవుతుందని సాక్షి మహారాజ్ తప్పక గెలుస్తారనీ బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. భారియచ్ లాంటి సీటులో గెలిచిన బీజేపీ నేత సావిత్రీ బాయ్ పూలే కాంగ్రెస్ లో చేరిపోవడం బీజేపీకి మింగుడు పడని అంశం కాగా, గత ఎన్నికల్లో ఓడినా ఈసారీ స్మృతీ ఇరానీనే రాహుల్ ప్రత్యర్ధిగా నిలపడం కాంగ్రెస్ ను కంగారు పెట్టిస్తున్న అంశం.

ఇలా ఎన్నో రాజకీ, సామాజిక, ఆర్థిక అంశాల మేళవింపు అయిన అవధ్ ప్రాంతంలో గెలుపు కోసం రాజకీయ పార్టీలన్నీ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి, రైతుల సమస్యలు, పంటలు ధ్వంసం చేసే క్రూర మృగాల నుంచి రక్షణ ఈ ఎన్నికల్లో కీలకమైన అంశాలుగా మారుతున్నాయి. వీటితో పాటూ పెద్ద సంఖ్యలో ఉన్న జాతవులు, యాదవులు, ముస్లింలు, నిషాద్ లు ఎటు మొగ్గు చూపితే ఫలితం ఆ పార్టీకే అనుకూలంగా మారనుంది.


Full View

Similar News