దేశ రాజధానిలోని ఏడు లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడానికి మూడు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. అభ్యర్థులను ఆచితూచి ఖరారు చేసిన బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఎవరికి వారే బరిలో దిగుతున్నాయి. మొదట్లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకుంటుందని అంచనాలు వేసినా అది కన్ఫామ్ కాకపోవడంతో త్రిముఖ పోరు ఢిల్లీ రాజకీయాన్ని అంతకంతకూ వేడెక్కిస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుండ బద్దలు కొట్టేశారు. బీజేపీని ఓడించడమే నిజంగా ఆయన లక్ష్యమైతే కాంగ్రెస్‌తో ఏదో ఒక రకంగా సీట్ల సర్దుబాటుకు ఆప్ అంగీకరించాలి. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుకు హర్యాణా, చండీగఢ్‌లో సీట్ల సర్దుబాటుకు ఆయన ముడిపెడతుండటంపై రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ రెండుచోట్లా తమకు కాంగ్రెస్ సీట్లు వదలకపోతే ఢిల్లీలో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని కేజ్రీవాల్ చెప్పేయడంతో ఢిల్లీలో త్రిముఖ పోరే ఖరారైంది.
చివరి నిమిషం వరకు కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఉంటుందని భావించినా, చర్చలు ఫలించక వేర్వేరుగానే జాబితాలు ప్రకటించాయి. ఆప్ మొత్తం ఏడుగురు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగింది. కాంగ్రెస్ కూడా పేర్లన్నీ ఖరారుచేసింది. బీజేపీ ఆరింటికి ఓకే చెప్పయగా.. ఇంకొక్క స్థానంలో అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. 2014 ఎన్నికల్లో ఏడు స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. వారిలో ఐదుగురికి ఈసారి అవకాశం ఇచ్చింది. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను కొత్తగా తెరపైకి తీసుకొచ్చింది.
ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ కొత్త ముఖాలనే తెరపైకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ నుంచి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ తొలిసారి లోక్‌సభ బరిలో నిలిచారు. ఆమె ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. తొలుత ఆమె చాందినీచౌక్ నుంచి పోటీ చేస్తారని భావించారు. కానీ వ్యాపారవర్గాలు ఎక్కువగా ఉండటం ఆప్, బీజేపీ వ్యాపారవర్గాలకు చెందినవారిని బరిలోకి దించడంతో మరో సీనియర్ నేత జేపీ అగర్వాల్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఇక్కడ పోటీలో నిలిపింది. దక్షిణ ఢిల్లీ నుంచి సజ్జన్‌కుమార్ సోదరుడు రమేశ్‌కుమార్ పేరు వినిపించినా తర్వాత బాక్సర్ విజేందర్ సింగ్‌కు ఆ స్థానంలో అవకాశం కల్పించారు. మొత్తం ఏడు స్థానాలకు మే 12న పోలింగ్ జరగనుంది.