ఉత్తర ధృవం అంటే.. అది కేవలం మంచు కొండలా మాత్రమే ఉంటుందని మనకు తెలుసు. కానీ గ్లోబల్ వార్మింగ్‌కు సంబంధించిన ప్రమాదకరమైన సంకేతాలు ఇప్పుడు ఎలా ధ్వనిస్తున్నాయంటే.. ఉత్తరధృవం వ్యాప్తంగా ఉండవలసిన మంచు గడ్డలు కరిగి అదే ప్రాంతంలో సరస్సుల్లాగా దర్శనమిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వలన పొంచి ఉన్న ప్రమాదానికి ఇది సంకేతం అని.. ఇది యావత్ ప్రపంచానికి హెచ్చరిక అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన అర్ధశతాబ్దంగా ఉత్తర, దక్షిణధృవాల్లో వాతావరణం మారిపోతుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగిపోతున్నాయి. భూమిపై ఉన్న స్వచ్ఛ జలాల్లో 60శాతం మంచుగడ్డల రూపంలోనే ఉంది. అయితే, ఈ మంచు ఫలకలు వేగంగా కరిగిపోతున్నాయి. ప్రత్యేకించి రెండు ధృవాల్లో ఉన్న హిమానీనదాలు సముద్ర వేడికి తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఏటా వందల కోట్ల టన్నుల మంచుగడ్డలు కరిగిపోయి.. సముద్రంలో కలిసిపోతున్నాయని అంచనా.
మంచు ఫలకలు పగిలిపోయి, కరిగిపోయి సముద్రంలో కలిసిపోతే తీర ప్రాంతాల్లోని నగరాలు కనీవినీ ఎరుగని బీభత్స పరిస్థితిని ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కోట్ల మంది ప్రజలు సముద్ర తీరాన్ని వదిలి.. ప్రధానభూభాగంలోకి వలస పోవాల్సి ఉంటుందని చెబుతున్నారు పర్యావరణవేత్తలు. మంచుగడ్డలు కరుగకుండా నిరోధిస్తున్న రాస్ ఐస్ షెల్ఫ్‌పై కొలంబియా శాస్త్రవేత్తలు ఈ ధృవాల్లో వేసవికాలాల్లో పరిశోధన జరిపారు. అయితే, ఇది రానున్న కొద్ది దశాబ్దాల్లో కుప్పకూలిపోతుందన్నది విశ్లేషకుల అంచనా. ఉత్తర, దక్షిణ ధృవాల్లో కోట్ల సంవత్సరాల నుంచి మంచుగడ్డలు పేరుకుని ఉన్నాయి. అక్కడ కురిసే మంచు పలుచటి పొరలుగా మారి.. క్రమంగా భారీ మంచుగడ్డలుగా రూపొంది, కొండలు, పర్వతాలను కప్పేస్తాయి. అక్కడ మంచు పొర దాదాపు మూడు కిలోమీటర్లకుపైగా మందంతో ఉంటుంది. ఇది మొత్తం కరిగిపోతే మొత్తం భూమిపై 160 అడుగుల ఎత్తున నీరు అవరిస్తుంది. భూగర్భంలో లభించే శిలాజ ఇంధన వనరులు మొత్తాన్నీ ఉపయోగించేస్తే వచ్చే వేడి, కాలుష్యంతో ఈ మంచు పలకలు కరిగిపోవడం ఖాయం. వాస్తవానికి 25వేల సంవత్సరాల క్రితం నుంచే హిమానీనదాలు కరుగుతూ వస్తున్నాయి. అయితే అది స్వాభావిక ప్రక్రియ. ప్రస్తుతం జరుగుతున్నది మాత్రం దీనికి భిన్నమైన విధ్వంసం.
శీతాకాలంలో ఉత్తర ధృవం వద్ద ఉష్ణోగ్రతలు పెరగడం పట్ల శాస్త్రవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆర్కిటిక్ ఖండంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కిందటేడాది మార్చి 20 వరకు ఉత్తర ధృవం వద్ద సూర్యుడు కనిపించడు. సాధారణంగా ఈ సమయంలో ఆ ప్రాంతంలో అత్యంత శీతలంగా వుంటుంది. ఏడాదిలో కెల్లా చల్లగా వుండే సమయమిదే. అయితే అసాధారణమైన పరిణామం సంభవించింది. తుపాను కారణంగా గ్రీన్‌ల్యాండ్ సముద్రం మీదుగా వేడి గాలులు రావడంతో మంచు కరిగే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర ధృవం వద్ద 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగి వుండవచ్చునని అమెరికా గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ తెలిపింది. వాస్తవానికి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలను నమోదు చేయడానికి నేరుగా ఎలాంటి పద్ధతులు లేవు. సాధారణం కన్నా 30 డిగ్రీల సెల్సియస్‌కి పైగా వుండవచ్చునని విశ్లేషణల ద్వారా తెలుస్తోంది. డానిష్ వాతావరణ సంస్థ 1958 నుండి సేకరిస్తున్న డేటాను పరిశీలిస్తే ఇది చాలా ఎక్కువట. ఒకప్పుడు అరుదుగా వుండే ఇటువంటి వేడిగాలులు ఇప్పుడు చాలా సర్వసాధారణమవుతున్నాయని పరిశోధనల్లో తేటతెల్లమవుతుంది.