ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్ధుల ఎంపికలో అధికార టీడీపీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేసింది. పలువురు పాతకాపులను పక్కనపెట్టి వారి వారసులకు సీట్లు కేటాయించింది. పలువురు ఎమ్మెల్యేలను సైతం తొలిసారిగా ఎంపీ ఎన్నికల బరిలో నిలిపింది. సైకిలు గుర్తుపై పోటీకి దిగుతున్న టీడీపీ ఎంపీ అభ్యర్థులను ఓసారి చూద్దాం.
నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో వరుసగా రెండో ఎన్నికల సమరం హాట్ హాట్ గా మారింది. లోక్ సభ, శాసనసభలకు ఏకకాలంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఏపీలోని రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు ప్రజలకు సైతం కీలకంగా, ఓ మహాపరీక్షగా మరాయి. విభజన హామీలు అమలు జరగాలంటే మొత్తం 25 ఎంపీ స్థానాలు నెగ్గితీరాలన్న లక్ష్యంతో ఏపీ అధికార, ప్రతిపక్షపార్టీలూ బలమైన అభ్యర్ధులను మాత్రమే బరిలోకి దించడానికి ప్రాధాన్యమిచ్చాయి.
అధికార తెలుగు దేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా చూస్తే రికార్డుస్థాయిలో 15 మంది కొత్తవారు బరిలోకి దిగుతున్నారు.కేవలం పదిమంది సిట్టింగ్ లకు మాత్రమే వరుసగా రెండోసారి పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చింది. లోక్ సభకు టీడీపీ అభ్యర్ధులుగా పోటీలో ఉన్న మొత్తం 15 మంది సరికొత్త అభ్యర్థుల్లో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు.
కడప లోక్ సభ స్థానం నుంచి ఆదినారాయణరెడ్డి, ఒంగోలు స్థానం నుంచి శిద్దా రాఘవరావు బరిలోకి దిగుతున్నారు. మరోవైపు రాజంపేట ఎమ్మెల్యే డీకే సత్యప్రభ, నరసాపురం శాసన సభ్యుడు వేటుకూరి శివరామరాజు లోక్ సభ సమరానికి సిద్ధమయ్యారు. తొలిసారి పోటీలో ఉన్న నవతరం అభ్యర్థుల్లో భరత్, ఆనంద్, హరీశ్, రూప, శివానంద రెడ్డి, పవన్ రెడ్డి ఉన్నారు. టీడీపీలో ఇటీవలే చేరిన ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం లోక్ సభ సీట్లను దక్కించుకోగలిగారు. అరకులో కిశోర్ చంద్రదేవ్, తిరుపతి నుంచి పనబాక లక్ష్మి, కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీకి దిగుతున్నారు.
రాజకీయ కుటుంబానికి చెందిన అడారి ఆనంద్ అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నా రు. రాజకీయ కుటుంబానికే చెందిన మాండ్ర శివానందరెడ్డికి నంద్యాల లోక్‌సభ స్థానం దక్కింది.కర్నూలు జిల్లాలో ఇటీవలే.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గౌరు దంపతులకు ఆయన సమీప బంధువు. పారిశ్రామికవేత్తలు చలమలశెట్టి సునీల్ కాకినాడ నుంచి, బీద మస్తాన్‌రావు నెల్లూరు నుంచి పోటీకి
దిగుతున్నారు.
గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన విశాఖ, నరసాపురం, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాల్లో ఈసారి టీడీపీయే తన అభ్యర్థులను బరిలోకి దింపింది. టీడీపీ అభ్యర్థుల్లో విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉన్న బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ , అమలాపురం అభ్యర్థి హరీశ్, రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న రూప, అనంతపురం అభ్యర్థి జేసీ పవన్‌రెడ్డి, శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్‌నాయుడు యువతరానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
వరుసగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అశోక గజపతి రాజు, రాంమోహన్ నాయుడు, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణరావు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, శ్రీరాం మాల్యాద్రి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్ ఉన్నారు.
సీట్లు దక్కని సిటింగ్ ప్రముఖ ఎంపీల్లో జేసీ దివాకర్‌రెడ్డి, మాగంటి మురళీ మోహన్ ఉన్నారు. దివాకర్‌రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి, మురళీమోహన్ కు బదులు గా ఆయన కోడలు రూప ఎంపికయ్యారు.
టీడీపీకి చెందిన ఇద్దరు దివంగత నేతల వారసులు సైతం ఈసారి ఎంపీలుగా బరిలోకి దిగుతున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ మాధుర్ అమలాపురం నుంచి, విశాఖకు పలు సార్లు టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసిన ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్.. విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. టీడీపీ తరపున ఎంపీలుగా పోటీ చేస్తున్న వారిలో కిశోర్ చంద్రదేవ్‌కు అత్యంత సీనియర్ గా రికార్డు ఉంది. ఆయన అరకు లోక్‌సభ సభ్యుడిగా ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించారు. వైసీపీ, జనసేనపార్టీ అభ్యర్థుల నుంచి టీడీపీ అభ్యర్థులకు గట్టిపోటీ ఎదురుకానుంది.