తెలంగాణలో చేయిచ్చి... ఆంధ్రలో ఎందుకు వదిలేసింది... కాంగ్రెస్ ఒంటరి పోరు వెనుక కథ
ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా పోటీ చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయం, తిరుగుబాటుకు దారి తీస్తోందా...అసలే మూలాలు చెదిరిపోయి, బలంలేని టైంలో, సింగిల్ ఫైట్ నష్టం తెస్తుందని కొందరు సీనియర్లు భావిస్తున్నారా...అధిష్టానం నిర్ణయం మారకుంటే, తామే పార్టీ మారాలని డిసైడ్ అయ్యారా...కాంగ్రెస్ ఒంటరి పోరు నిర్ణయం ప్రకంపనలేంటి? తెలుగుదేశంతో పొత్తు లేకుండానే రాబోయే ఎన్నికల్లో పోటీకి దిగుతామని స్పష్టం చేసిన కాంగ్రెస్ పార్టీకి, షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తున్నారు నేతలు. అసలే 2014లో ఘోరంగా ఓడిపోయి, బలాబలాలు చెదిరిపోయిన నేపథ్యంలో, మరో బలమైన పార్టీ అండలేకపోతే, చాలా కష్టమని మథనపడుతున్నారు. టీడీపీతో పొత్తుంటుందని ఇంతకాలం చర్చ జరగడంతో, ఊపిరిపీల్చుకున్న నేతలకు, ఇప్పుడు ఒంటరిపోరు నిర్ణయం, మూలిగే నక్కపై తాటికాయ చందంగా మారింది. ఈ పరిణామం రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందని భావిస్తున్న కొందరు నాయకులు, మరో పార్టీ వెతుక్కునే పనిలో పడ్డారు.
కర్నూలు జిల్లాలో కోట్ల అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే కోట్లా. ఇలా అత్యంత పేరు తెచ్చుకుంది కోట్ల విజయభాస్కర రెడ్డి కుటుంబం. గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగానూ పని చేశారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. అయితే తాజాగా ఆయన, పార్టీ మారే ఆలోచనలో పడ్డారన్న చర్చ మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడిన తీరును బట్టి చూస్తే...త్వరలోనే పార్టీ మారడం ఖాయమని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. టీడీపీతో పొత్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైసీపీలోకి వెళతారని చాలాకాలం క్రితమే ప్రచారం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని... అందులో భాగంగా కర్నూలు ఎంపీ సీటుతో పాటు తన భార్య కోట్ల సూజాతకు ఎమ్మెల్యే సీటు కూడా వస్తుందని ఆయన ఆశించినట్టు వార్తలు వినిపించాయి.
ఈ కారణంగానే వైసీపీ నుంచి ఆహ్వానం ఉన్నా... ఆయన దాన్ని తిరస్కరించారని కర్నూలు జిల్లా రాజకీయవర్గాల్లో టాక్ ఉంది. తాజాగా టీడీపీతో పొత్తు ఉండదని...కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి నచ్చలేదని తెలుస్తోంది. అయితే, పార్టీ మారాలనుకుంటున్న కోట్ల, మరి వైసీపీలోకి వెళతారా, టీడీపీలోకి వెళతారా అన్నది చర్చనీయాంశమైంది. కానీ కర్నూలు నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన బుట్టారేణుక, ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. దీంతో కర్నూలు నుంచి టీడీపీ ఎంపీగా ఆమెనే పోటీచేసే ఛాన్సుంది. దీంతో టీడీపీలోకి కోట్ల వెళతారా అన్నది డౌటే. వైసీపీ నుంచి ఛాన్సుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరి ఆయన అడుగులు సైకిల్ వైపు వెళతాయా, ఫ్యాన్ కిందకా అన్నది కొద్దీరోజుల్లోనే తేలనుంది.
సూర్యప్రకాశ్ రెడ్డి దారిలో మరో కాంగ్రెస్ మాజీ ఎంపీ కిల్లీ కృపారాణి కూడా పయనించే ఛాన్సుంది. 2009లో శ్రీకాకుళం నుంచి గెలిచిన కృపారాణి, 2014లో ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఒంటరిపోరు నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. త్వరలోనే వైసీపీ గూటికి చేరాలని భావిస్తున్నారు. వీరేకాదు, చాలామంది నేతలు కూడా పార్టీ మారడమే బెటరని భావిస్తున్నారు.