ఓట్ల వేటలో తామేమీ తక్కువ కాదని తేల్చేసింది ఏపీ సర్కార్...ఎన్నికల వేళ మధ్యంతర బడ్జెట్ లేదా ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టాల్సింది పోయి పూర్తి స్థాయి సాధారణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఎన్నికల్లో గెలుపు కోసం కీలక వర్గాలను ఆకట్టుకునే విధంగా బడ్జెట్ ను రచించింది. రైతులు,మహిళలు, నిరుద్యోగులే టార్గెట్ గా భారీ స్కెచ్ రచించింది. దాదాపు రెండు లక్షల కోట్లతో రచించిన ఈ బడ్జెట్ లో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మాదిరిగా రైతుకు పెద్ద పీట వేసింది.
అన్నదాతా సుఖీభవ పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలుకు 5 వేల కోట్లు కేటాయించారు. రైతులకు పంట పె ట్టుబడి సాయంగా ఇది పనికొస్తుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో ప్రకటించారు.. మొత్తం బడ్జెట్ లో సంక్షేమ పథకాలకే చంద్రబాబు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. రెండు లక్షల కోట్ల బడ్జెట్ లో దాదాపు 65 వేల కోట్ల మొత్తాన్ని సంక్షేమ పథకాలకు కేటాయించారు. ఇక డ్వాక్రా మహిళలకు గతంలో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చకుండానే పథకం పేరు మార్చి చంద్రన్న పసుపు కుంకుమ పథకం అని పెట్టారు. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం 1100 కోట్లు కేటాయించారు. అలాగే డ్వాక్రా మహిళలకు పదివేలు రుణాలందిస్తామన్నారు యనమల.