ఏపీలో టీడీపీకి మరో ఎంపీ ఝలక్ ఇచ్చారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. మరోసారి పోటీకి టీడీపీ ఆయనకు స్పష్టత ఇవ్వకపోవడంతో వైసీపీలోకి జంప్ అయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
తెలుగుదేశం పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు టీడీపీకీ తాజా షాక్ ఇచ్చారు. లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో రవీంద్రబాబు వైసీపీలో చేరారు. రవీంద్రబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. మరోసారి ఎంపీగా పోటీపై టీడీపీ రవీంద్రబాబుకు క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబు వల్లే ప్రత్యేక హోదా రాలేదన్నారు రవీంద్రబాబు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని రవీంద్రబాబు పుట్టింటికి వచ్చినట్టుగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారని, ఆయన వల్లే ప్రత్యేక హోదా రాలేదని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోవడం వల్లే చంద్రబాబు హడావుడిగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేశారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ప్రతిచోట అవినీతి పెరిగిపోయిందని, ఒకే సామాజిక వర్గానికి మేలు జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా బాబు పనికిరారని, ఆయన వల్ల రాష్ట్రం బాగుపడదంటూ రవీంద్రబాబు ఆరోపించారు.