పార్టీల మధ్య పొత్తులు రాష్ట్రాల వారీగా ఉంటాయనేది ఇప్పటికీ వర్తించే సూత్రం. ఈ లెక్కన బీజేపీని బలహీనం చేయాలన్న తన వైఖరికి అనుగుణంగా ఆప్ వ్యవహరించడం లేదన్న విమర్శలున్నాయి. హర్యాణాలో కాంగ్రెస్, జన నాయక్ జనతా పార్టీ (జేపీపీ), ఆప్ చేతులు కలిపి పోటీ చేస్తే బీజేపీని సునాయాసంగా ఓడించవచ్చన్న కేజ్రీవాల్ మాటను కాంగ్రెస్ లెక్కచేయలేదు.
ఎన్నికల్లో పొత్తులు గరిష్ట స్థాయిలో కుదరవు. పశ్చిమబెంగాల్‌లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్య చర్చలు జరిగినా సీట్ల సర్దుబాటు జరగలేదు. బీజేపీ ఉమ్మడి శత్రువు అయినా కేరళలో అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఇంత జరిగినా ఈ పార్టీలు తమిళనాడులో డీఎంకే నాయకత్వంలోని కూటమిలో భాగస్వాములయ్యాయి. బీహార్, జార్ఖండ్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదిరింది. కాని, జార్ఖండ్‌లోని ఒక్క చాత్రా సీటు విషయంలో పేచీ వచ్చి రెండు పార్టీలూ అభ్యర్థులను నిలిపాయి.
ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ తమ మహాగఠ్ బంధన్‌లో కాంగ్రెస్‌కు స్థానం కల్పించలేదు. కాంగ్రెస్‌పై ఈ కూటమి రెండు సీట్లలో పోటీ పెట్టలేదు. కూటమికి చెందిన బడా నేతలు పోటీ చేస్తున్న ఏడు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలపలేదు. ఈ రకంగా కాంగ్రెస్‌తో మహాగఠ్ బంధన్‌కు అవగాహన కుదిరింది. అంటే వివిధ రాజకీయ పక్షాల మధ్య పొత్తులు ఎప్పుడు, ఎక్కడ కుదురుతాయన్న విషయం ఆ పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకచోట కుదిరిన సీట్ల సర్దుబాటు మరోచోట సాధ్యం కాకపోవచ్చు. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు అవసరంపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ నచ్చచెప్పగలిగారు. కాని, హర్యాణాలో ఆప్ మిత్రపక్షమైన చౌటాలాల పార్టీ జేపీపీకి మూడు సీట్లు ఇప్పించడం రాహుల్‌కు అంత ఈజీయేమీ కాదు.
కాంగ్రెస్‌తో పొత్తు కోరుకుంటున్నామంటూనే ఆప్ రోజుకో రకంగా షరతులు పెట్టింది. ఈ ఏడాది ఆఖరులో లేదా వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల్లో మరోసారి విజయం సాధించడానికి ఏం చేయాలో ఆప్ అదే చేస్తోంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్ల కన్నా మళ్లీ రాజధానిలో గద్దెనెక్కడానికే ఆప్ ప్రాధాన్యం ఇస్తోంది. ఢిల్లీలో తమ మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోవడానికి కాంగ్రెసే కారణం కానీ, తాను కాదని ఇతరులను నమ్మించడానికి ఆప్ గట్టి కృషే చేస్తోంది. దేశ రాజధానిలోని ఏడు సీట్లనూ వీలైతే గెలుచుకోవడం ద్వారా బీజేపీని కొంత వరకైనా నిలువరించవచ్చన్న సిద్ధాంతాన్ని అమలు చేస్తోంది.