ఏడు దశాబ్దాల రాజ్యాంగం... అందించిన ప్రజాస్వామ్యం

Update: 2019-01-26 06:17 GMT

వందకోట్ల మందికి ఆమోద యోగ్యంగా వుండే పాలనా వ్యవస్థను రూపొందించడం అంత సులభం కాదు. అంతేకాదు.. దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారిని జన జీవన స్రవంతిలో కలపడానికి కొన్ని చట్టాలు, వాటికి కొన్ని సవరణలూ తప్పనిసరి.. భారత దేశ స్థితి గతులను సమున్నతంగా మార్చేసిన కొన్ని కీలక చట్టాలు, వారి సవరణలనొకసారి చూద్దాం..ఈ 70 ఏళ్లలో కాలానికనుగుణంగా మనం ఎన్నో చట్టాలను రూపొందించుకున్నాం.. ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. కొన్ని చట్టాలు దేశ గతినే మలుపు తిప్పితే.. మరికొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 15 నెలలకే మొదటి సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా భూ సంస్కరణలకు ఎలాంటి సవాళ్లు ఎదురు కాకుండా దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఎన్నో భూ చట్టాలకు ఇది రక్షణ కవచంలా నిలిచింది.

ఒకటే బాణం.. ఒకటే భార్య.. ఇది శ్రీరాముడి విధానమే కాదు.. కోట్లాది భారతీయుల మనోగతం కూడా.. హిందూ సంప్రదాయం.. హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి 1955లో హిందూ వివాహ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ద్వారా బహుభార్యాత్వం రద్దవడమే కాకుండా.. మహిళల రక్షణ కోసం విడాకుల భావనను కూడా ప్రవేశపెట్టారు.ఇక 1986లో వచ్చిన ముస్లిం మహిళ విడాకు హక్కుల రక్షణ చట్టాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. దేశంలో అప్పట్లో తలెత్తిన మత హింసకు ఈ చట్టమే దోహదం చేసిందని కొందరు కారాలు మిరియాలు నూరితే.. ముస్లిం ఛాందసవాదుల్ని సంతృప్తి పరచడం కోసమే దానిని తెచ్చినట్టు మరికొందరు మండిపడ్డారు.

ఇక సామాజిక రుగ్మతైన అంటరానితనాన్ని తరిమివేయడానికి మన ప్రభుత్వానికి అయిదేళ్లు పెట్టింది. అంటరానితనాన్ని నేరంగా ప్రకటిస్తూ 1955లో చట్టాన్ని చేశారు.దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం అప్పట్లో ఊపందుకుంది. దీంతో 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా దేశాన్ని 14 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. తెలుగు, మళయాళీ, కన్నడీగులకు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ప్రపంచంలో మరెక్కడా లేనన్ని రాజకీయ పార్టీలున్న దేశం కూడా మనదే.. 1980వ దశకం భారత రాజకీయాల్లో అనారోగ్య కర ధోరణులకు బీజం పడిన సమయం.. అధికార కాంక్షకు తోడు ఆయారాం, గయారాం సంస్కృతి పెచ్చరిల్లిన తరుణమూ అదే.. దీని నియంత్రణ కోసమే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది.

ఆమ్‌ఆద్మీ.. ఈ నినాదంతో అధికారంలోకొచ్చిన ‍యుపి ఏ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టంగా చేసి నిరుద్యోగాన్ని, ఆకలి కేకలను రూపుమాపాలని తలపెట్టింది. అన్నదే తడవుగా రాజ్యాంగ సవరణ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేసింది. గ్రామీణ భారతావని రూపు రేఖలను సమున్నతంగా మార్చేసిన చట్టమది. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం సమాచార హక్కు చట్టం.. ప్రభుత్వ పాలనపై ఇదో డేగ కళ్ల పహారా.. అవినీతి, రెడ్ టేపిజం వేళ్లూనిన మన సమాజంలో తప్పు చేసిన అధికారి ఎంత పెద్ద వాడైనా నిలదీసే హక్కుని ఈ చట్టం కల్పిస్తోంది. అంతేనా.. గతి తప్పి నడుచుకునే అధికారులపై కొరడా ఝళిపించడానికీ ఈ చట్టం ఉపయోగపడుతోంది. 

Similar News