ఆరో విడత పోలింగ్‌లోనూ సేమ్ సీన్లే రిపీట్ అయ్యాయి. గత ఐదు విడతల తరహాలోనే పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా బీహార్, ఉత్తర ప్రదేశ్‌లలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 483 నియోజకవర్గాల్లో ఎన్నికలు ముగిసాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం సాయంత్రం ఆరు గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైంది.
పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన ఐదు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాజధాని ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగడంతో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు జాతీయ స్ధాయి రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికి పశ్చిమ బెంగాల్‌లోనే భారీగా పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో 80.53 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు జరిగిన అన్ని స్ధానాల్లో 76 శాతం పైగానే పోలింగ్ నమోదైంది. తమ్‌లుక్ నియోజకవర్గంలో అత్యధికంగా 83.05 శాతం పోలింగ్ నమోదైంది. ఘతాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న భారతి ఘోష్‌పై దాడి చేయడంతో ఉద్రిక్తత రేగింది. ఈ ఘటనపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేయడంతో అధికారుల నుంచి నివేదిక కోరింది.
బీహార్‌లో చెదురుమదురు ఘటనలు జరిగినా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఎనిమిది స్థానాల్లో 56 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని ఏడు నియోజకవర్గాల్లో 61.05 శాతం, హర్యానాలోని మొత్తం పది నియోజకవర్గాల పరిధిలో 63.08 శాతం, జార్ఖండ్‌లోని నాలుగు స్థానాల పరిధిలో 65.53 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
ఇక రాజధాని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లలో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదయ్యింది. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 56.53 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ఇక్కడి ఏడు స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ .. ఈసారి కూడా తమవేనంటూ ధీమా వ్యక్తం చేస్తూ వస్తోంది. అయితే ఓటింగ్ శాతం తగ్గడంతో అటు ఆప్, ఇటు బీజేపీ , మధ్య లో కాంగ్రెస్ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని 14 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ మందకోడిగానే జరిగింది. మొత్తం మీద 52 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని దోమారియా గంజ్‌లో అత్యల్పంగా 47.03 శాతమే పోలింగ్ నమోదుకాగా .. శాంత్ కబీర్ నగర్‌లో 55.67 శాతం పోలింగ్ జరిగింది.
ఆరో విడత ఎన్నికలు కూడా ముగియడంతో చివరి విడత పోలింగ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 22 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు ముగిసాయి. చివరి విడతలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, దాద్రా నగర్ హవేలిలో ఏక కాలంలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు బీహార్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్ జరగనుంది. ఈ నెల 19న చివరి విడత పోలింగ్ జరగనుంది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు దృష్టి సారించాయి.