మూడో దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి...అదృష్టం పరీక్షించుకోనున్న కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు..

Update: 2019-04-22 16:26 GMT

ఈవీఎంల మొరాయింపు. ఘర్షణలు. ఒక మోస్తరు పోలింగ్‌. ఇవీ రెండు దశల ఎన్నికల చిత్రం. ఇంకో దశ పోలింగ్‌కు సిద్ధమవుతోంది దేశం. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి రెండు దశల్లో కనిపించని స్పష్టత ఈదశలో రావచ్చంటున్న విశ్లేషకుల అంచనాల మధ్య 115 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించనుంది ఈసీ.

సార్వత్రిక ఎన్నికల్లో మూడో ఘట్టానికి తెరలేచింది. 14 రాష్ట్రాల్లో 115 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహు‌ల్‌గాంధీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా‌తో పాటు ఎంతో మంది ప్రముఖులు మూడో దశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అసోంలో 4, బీహార్‌లో 5, ఛత్తీస్‌‌గఢ్‌లో 7, గుజరాత్‌లో 26, గోవాలో 2, జమ్మూకశ్మీర్‌లో 1, కర్నాటకలో 14, కేరళలో 20, మహారాష్ట్రలో 14, ఒడిషాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 10, దాద్రా హవేలీలో 1, డయ్యూలో 1, పశ్చిమబెంగాల్‌లో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక రెండో దశలో వాయిదాపడ్డ త్రిపుర ఈస్ట్‌కు కూడా మూడో దశలోనే పోలింగ్ జరగనుంది.

కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్, కాంగ్రెస్‌తో కూడిన యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ రెండు చిన్న పార్టీలతో జతకట్టిన బీజేపీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో... రెండో దశలో సగం సీట్లకు పోలింగ్‌ జరిగింది. మిగిలిన 14 స్థానాలైన చిక్కోడి, బెళగావి, బాగల్‌కోట్, బిజాపూర్‌, హావేరీ, ధార్వాడ్‌తో పాటు ముంబై కర్ణాటక ప్రాంతంలోని గుల్బర్గ, బీదర్, రాయచూర్, బళ్లారి, కొప్పళ, శివమొగ్గ, దావణగెరె, ఉత్తర కన్నడ స్థానాలకు మూడో దశలో పోలింగ్‌ జరగనుంది.

మహారాష్ట్రలోని పుణె, బారామతి, అహ్మద్‌నగర్, మాధా, సాంగ్లీ, సతారా, కోల్హాపూర్, హట్కన్‌మంగ్లే , జల్‌గావ్, రావేర్, జాల్నా, ఔరంగాబాద్, రాయ్‌గడ్, రత్నగిరి–సింధుదుర్గ్‌ లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఇక ఉత్తరప్రదేశ్‌‌లో కులం, మతం, ప్రాంతం ప్రభావితం చేయనున్నాయి. సినీ నటి జయప్రద, ఎస్పీ సీనియర్‌ నేత ఆజంఖాన్‌ మధ్య రాంపూర్‌ వేదికగా జరుగుతున్న పోటీ దేశం దృష్టిని ఆకర్శిస్తోంది. కేంద్ర మంత్రి మేనకాగాంధీకి పట్టున్న పిలీభీత్‌ నుంచి ఈసారి ఆమె కుమారుడు వరుణ్‌ గాంధీ పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న మెయిన్‌పురి నుంచి పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌ బరిలో ఉన్నారు.

ఇక ఒడిషాలో ఆరు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. పూరి, కటక్‌ నియోజకవర్గాల్లో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. బీహార్‌లోని జంజీహార్‌పూర్, సౌపాల, మాధేపుర, ఖగారియా, అరారియా స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. త్రిముఖపోటీతో మాధేపూర్‌ వేడెక్కుతోంది. ఇక మమతా బెనర్జీ అడ్డా పశ్చిమ బెంగాల్‌లో మూడో దశలో పోలింగ్‌ జరిగే బేలూర్‌ఘాట్, మల్దా ఉత్తర్, మల్దా దక్షిణ్, జంగీపూర్, ముర్షిదాబాద్‌ స్థానాల్లో 40 శాతం వరకు ముస్లింలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎవరి ఆశలు వారివే. ఇక దేశమంతా ఆసక్తిగా చూస్తున్న మరో కీలక రాష్ట్రం గుజరాత్. ఇక్కడ మోడీ మ్యాజిక్‌ రిపీట్ అవుతుందని కమలనాథులు ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలను గెలిచి బీజేపీ రికార్డు సృష్టించింది. ప్రధానిగా మోడీ అధికార పగ్గాలు చేపట్టాక ఆయన సొంత రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. కాకపోతే మరోసారి మోడీ, గుజరాత్‌ ఆత్మ గౌరవం, ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు వంటి అంశాలతో ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా గాంధీనగర్‌ నుంచి పోటీ చేస్తుండటం కొంత కలిసొచ్చే అంశం. రైతులకు ప్రత్యేక బడ్జెట్, రుణమాఫీ వంటి హామీలు గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు మేలు చేసే అవకాశముంది. 

Similar News