ఒడిశా రాజధాని భువనేశ్వర్ పార్లమెంటు నియోజకవర్గం అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకం. ఖుర్ధా, జట్నీ, జయదేవ్, బెగునియా, భువనేశ్వర్-మధ్య, భువనేశ్వర్-ఉత్తర, భువనేశ్వర్-ఏకామ్ర అసెంబ్లీ స్థానాల్లో గెలుపు అంత సునాయాసమేమీ కాదు. అధికార పక్షానికి కంచుకోటగా ఉన్న ఈ స్థానాల్లో అధికార పార్టీ అయిదుసార్లు విజయం సాధిస్తూ తన సత్తా చాటుతోంది. మూడో దశ పోలింగ్‌ను ఎదుర్కొంటున్న భువనేశ్వర్‌లో తాజా పరిస్థితి ఏంటో చూద్దాం.
ఈసారి ఇక్కడి నుంచి మాజీ ఐపీఎస్ అధికారి అరూప్ పట్నాయక్‌ను ముఖ్యమంత్రి, బిజ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్‌పట్నాయక్ పోటీకి నిలిపారు. మరోవైపు మాజీ ఐఏఎస్ అధికారిణి అపరాజిత షడంగిని బీజేపీ బరిలోకి దించింది. వీరిద్దరి మధ్య కాంగ్రెస్ మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత జనార్ధన పతి రంగంలో ఉన్నారు. ముక్కోణ పోరులో రాజధాని వాసులు ఎవర్ని గెలిపిస్తారన్నది ఈనెల 23న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం కానుంది.
రాజధాని వాసులు బిజ జనతాదళ్‌తో అనుబంధం పెంచుకున్నారు. ఢదుసార్లు ఆ పార్టీ నిలబెట్టిన ప్రసన్నకుమార్ పట్సానీని గెలిపించారు. త్వరలో ఆయనను రాజ్యసభకు పంపిస్తామన్న నవీన్ ఈసారి అరూప్‌ను రంగంలో ఉంచారు. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఆయన ఒడియా వ్యక్తి. గతంలో ముంబయి పోలీసు కమిషనర్‌గా సమర్థంగా విధులు నిర్వహించారు. గతేడాది ఉద్యోగ విరమణ చేసిన పట్నాయక్ రాజకీయ అరంగేట్రం చేసి అధికార పార్టీలో చేరారు. నవీన్‌కు దగ్గరయ్యారు. భువనేశ్వర్ స్థానానికి అభ్యర్థి అయ్యారు.
అపరాజిత షడంగి ఈమె ఒడిశా ప్రజలందరికి సుపరిచితం. ఐఏఎస్ అధికారిణిగా ఆమె చేసిన సేవలెన్నో ఉన్నాయి. కీలక శాఖల కార్యదర్శిగా పనిచేశారు. నీతి నిజాయతీకి మారు పేరుగా నిలిచారు. భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అపరాజిత రాజధాని వాసులకు మంచి సేవలందించారు. మురికివాడలు, బస్తీల అభివృద్ధికి వివిధ కార్యక్రమాలు అమలు చేశారు. ఆమె భర్త ఐఏఎస్ అధికారి సంతోష్ షడంగి ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. మోడీ పనితీరు పట్ల ఆకర్షితురాలై ఉద్యోగానికి రాజీనామా చేసి గతేడాది బీజేపీలో చేరారు. భువనేశ్వర్ ప్రాంత ప్రజలతో మమేకమయ్యారు. ఆ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థి అయ్యారు.
ఉద్యమాలకు ఊపిరి జనార్దనపతి. కాకలు తీరిన కమ్యూనిస్ట్ నేత. ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా దీర్ఘకాలం పనిచేశారు. గొప్ప వక్త, రాజకీయ వ్యూహకర్తగా పేరుంది. రాష్ట్ర రాజధాని ప్రజల వాణి పార్లమెంటులో వినిపించాలన్నది ఆయన చిరకాల వాంఛ. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భువనేశ్వర్‌లో ఉమ్మడి అభ్యర్థిగా జనార్ధన బరిలోదిగి అధికార పార్టీని, బీజేపీని ఎదుర్కొంటున్నారు.