పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ సాగుతున్న జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించే దిశగా పావులు కదుపుతున్నారు. పార్టీ పెట్టాక ఇప్పటి వరకూ అనుబంధ సంఘాలే లేని విభాగాలకు వాటిని తక్షణం ఏర్పాటు చేస్తున్నారు.
ప్రజా సంకల్ప యాత్రతో కొన్ని నెలలుగా ప్రజల మధ్యనే ఉంటున్న జగన్ ఎన్నికలకోసం పార్టీని సమాయత్తం చేసే పనిలో పడ్డారు గత ఎన్నికల్లో జరిగిన పొరపాటును మళ్లీ రిపీట్ చేయకూడదన్న ఉద్దేశంతో పక్కా వ్యూహం వేస్తున్నారు పార్టీ ఏర్పాటు చేసి 8 ఏళ్లవుతున్నా మొన్నటి వరకూ పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టలేదు. గత ఎన్నికల్లో ఈ సంఘాలను సరిగా వినియోగించుకోకపోవడంతోనే ఓటమి చవి చూడాల్సి వచ్చిందని జగన్ భావిస్తున్నారు. అందుకే పార్టీలో వరసగా అన్ని కమిటీలు వేసి వరుస సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇప్పటికే విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో బీసీ, మహిళా, విద్యార్ధి, యూత్, మైనారిటీ మీటింగ్ లను నిర్వహించారు. గ్రామాల్లో ఆయా కమిటీల పరిధిలోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, దానికి తీసుకోవాల్సిన చర్యలేమిటన్న దానిపై స్పష్టమైన అభిప్రాయ సేకరణ చేయాలని కమిటీలను ఆదేశించనున్నారు. ఇటీవల జరిగిన బిసి సదస్సుకు జగనే స్వయంగా హాజరై వారికి అండగా ఉంటానని స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతేకాదు ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున బీసీలతో అనంతపురంలో బీసీ డిక్లరేషన్ పార్టీ తరపున ప్రకటించ నున్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునేలా జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. అన్ని వర్గాలనూ ఒప్పించి, మెప్పించి ఈసారి అధికారం సొంతం చేసుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.