కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. గులాబీకి కంచుకోటగా నిలిచే మార్కల్ గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారిప్పుడు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తమ గ్రామాన్ని పట్టించుకోవట్లేదంటూ భగ్గుమంటున్నారు. గ్రామాభివృద్ధికి గతంలో ఇచ్చిన హామీలను నేరవేర్చలేదంటూ మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి కానీ... ఓట్లేయమని అడగటానికి కానీ టీఆర్ఎస్ నేతలు గ్రామంలో అడుగు పెట్టనివ్వద్దంటూ తీర్మానం చేశారు. అసలేమైంది? ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మర్కూల్ ప్రజల ఆగ్రహ జ్వాలల వెనుక అసలు కారణమేంటి?
టీఆర్‌ఎస్ నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి తమకు చేసిందేమీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు తప్పా... మిగిలిన రోజుల్లో తాము గుర్తుకురానప్పుడు.... తామెందుకు ఓటేయ్యాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని.. మర్కల్ గ్రామంలో 18 నెలల క్రితం ఎంపీటీసీ సభ్యుడు మృతిచెందాడు. ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్న అప్పటి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిని ఏకగ్రీవం చేస్తే.. 25లక్షలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో..మిగతా పార్టీలు పోటీ నుంచి విరమించుకుని ఎంపీటీసీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదని మండిపడ్డారు గ్రామస్ధులు.
పోలీసుల పహారా మధ్య గ్రామానికి వచ్చిన అభ్యర్ధి వారంలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటున్న ఏనుగు రవీందర్‌రెడ్డి... హామీతో ఉద్రిక్తత చల్లారింది. ఏమైనా రెండు గంటల పాటు గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్ధి హామితో వివాదం సద్దుమణిగింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.