ఆ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. రెండున్నర దశాబ్దాల పాటు ఆ పార్టీ అభ్యర్ధులే అక్కడ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తర్వాత మారిన పరిణామాలతో.. టీడీపీ కోటకు గులాబీదళం గండి కొట్టింది. ఆ పార్టీ అభ్యర్ధికి వరుసగా హ్యాట్రిక్ విజయం అందించారు. టీఆర్ఎస్ కంచుకోటగా మారిన ఆ నియోజకవర్గంపై ఇప్పుడు తెలంగాణ జనసమితి కన్నేసింది. ఇటు కాంగ్రెస్ సైతం ఆ గడ్డపై తమ జెండా ఎగురేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం, రసవత్తర రాజకీయమేంటో చూద్దాం.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ముందస్తు ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ తరపున అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు. ఈ పాటికే ప్రచారం మొదలు పెట్టిన రవీందర్ రెడ్డికి.. ద్వితీయశ్రేణి నేతల అసంతృప్తి తలనొప్పిగా మారింది. మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ గౌడ్ టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ తీర్దం పుచ్చుకోవడంతో రవీందర్ రెడ్డికి.. ఊహించని షాక్ తగిలినట్లైంది. కాంగ్రెస్ నుంచి నలుగురు నేతలు టికెట్టు కోసం బల ప్రదర్శన చేస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న నల్ల మడుగు సురేందర్, రేవంత్ రెడ్డి వర్గం నేత సుభాష్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జమునా రాథోడ్, కాంగ్రెస్ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్ రావులు టికెట్టు రేసులో ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరికి టికెట్టు వచ్చినా మరో ముగ్గురు సహకరించే పరిస్ధితి కనిపించడం లేదు.
పొత్తులో భాగంగా, ఇదే స్ధానాన్ని తెలంగాణ జన సమితి పట్టుబడుతోంది. న్యాయవాది రచనారెడ్డిని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని.. ఆ పార్టీ భావిస్తోంది. బీజేపీ నుంచి మహిళా అభ్యర్ధిని బరిలో దింపాలని నిర్ణయించినా.. అభ్యర్ధిని ఇంకా ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారై ప్రచారంలో ముందుండగా, కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కుమ్ములాటలు అధికార పార్టీ అభ్యర్ధికి సానుకూలంగా మారే అవకాశం ఉంది. తెలంగాణ జనసమితికి టికెట్టు కేటాయిస్తే.. ఈసారి ఫలితం తారుమారయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎల్లారెడ్డి ఓటర్లు సాంప్రదాయం ప్రకారం.. పాత కాపుకు పట్టం కడతారా.. ? కొత్త సాంప్రదాయానికి తెరదీస్తారా అన్నది ఆసక్తిగా మారింది. త్రిముఖ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.