అక్క కోసం తమ్ముడు వస్తాడా? కూటమికి అండగా ఎన్టీఆర్‌ నిలుస్తాడా..?

Update: 2018-11-27 08:20 GMT


కూకట్‌పల్లిలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం చేస్తాడా? అక్క తరపున క్యాంపెయిన్ చేయడానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ డైలమాలో పడ్డారని తెలుస్తోంది. మరి జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఈ డైలమా ఎందుకు. అందుకు కారణాలేంటి? 
కూకట్‌పల్లిలో మహాకూటమి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు నందమూరి సుహాసిని. హరికృష్ణ తనయ. కల్యాణ్‌ రామ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ల సోదరి. హరికృష్ణ కుటుంబానికి తాము అండగా ఉన్నామంటూ, చంద్రబాబు కూకట్‌పల్లి సీటును ఆ కుటుంబానికే చెందిన సుహాసినికి  ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా సమీకరణాలే మారిపోయాయి.

సుహాసిని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు బాలకృష్ణ. ఈనెల 30 నుంచి ప్రచారంలోనూ పాల్గొనబోతున్నారు. 
అయితే, జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారంపై మొన్నటి వరకూ ఊగిసలాట కొనసాగింది. జూనియర్‌తో పాటు కల్యాణ్‌ రామ్‌ కూడా అక్క తరపున ప్రచారం చేస్తారని దాదాపు ఖరారైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ఈ విషయంపై, జూనియర్‌తో చర్చించి, కన్‌ఫామ్ చేశారు. అయితే, అక్క తరపున ప్రచారంలో ఏం మాట్లాడాలి అన్నదానిపై, జూనియర్ ఎన్టీఆర్‌ డైలమాలో పడ్డారని తెలుస్తోంది.

తండ్రి హరికృష్ణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వం. కేటీఆర్‌ దగ్గరుండి చివరి సంస్కారాలనూ పర్యవేక్షించారు. హరికృష్ణ స్మృతివనానికి స్థలం  కూడా కేటాయించారు. హరికృష్ణ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ప్రకటించారు కూడా. మరి తన తండ్రి అంతిమ సంస్కారాలను ఇంత గొప్పగా నిర్వహించిన కేసీఆర్‌ సర్కారుపై, విమర్శలు చేయడానికి జూనియర్‌ ఎన్టీఆర్ సంకోచిస్తున్నారని తెలుస్తోంది. తన తండ్రిని ఇంతగా గౌరవించిన కేసీఆర్‌పై ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అన్నదానిపై జూనియర్‌ మథనపడుతున్నారని సమాచారం. అందుకే ప్రచారంపై మొదటి నుంచి అంతర్మథనం చెందుతున్నారని, సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అలాగని అక్క తరపున ప్రచారం చేయకుండా ఉండలేడు.

ఈ కారణమే కాదు, మరికొన్ని అంశాలు కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ను డైలమాలో పడేశాయి. అనేక పరిణామాల నేపథ్యంలో, కొన్నేళ్లుగా టీడీపీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నారు జూనియర్ ‌ఎన్టీఆర్‌. తండ్రి హరికృష్ణ కూడా టీడీపీలో యాక్టివ్‌గా ఉండలేదు. 2014 ఎన్నికల ప్రచారంలోనూ హరికృష్ణ ఫ్యామిలీ నుంచి ఎవరూ పాల్గొనలేదు. పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేయడంతో, హరికృష్ణ ఫ్యామిలీ అక్కర్లేదన్నట్టుగా, చంద్రబాబు కావాలనే పక్కనపెట్టారని చర్చ జరిగింది. 

అంతేకాదు, హరికృష్ణ కుటుంబం వైసీపీకి దగ్గరయ్యిందన్న ప్రచారమూ సాగింది. ఎందుకంటే జూనియర్‌కు అత్యంత సన్నిహితుడు కొడాలి నాని, వైసీపీ ఎమ్మెల్యే, చంద్రబాబుపై ఇంతెత్తున లేచే నాయకుడు. అందుకే హరికృష్ణ కుటుంబానికి తిరిగి దగ్గరకు చేర్చుకునేందుకు, చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా సుహాసినికి సీటు ఇచ్చారని, రాజకీయ పండితుల విశ్లేషణ. దూరమైన హరికృష్ణ కుటుంబానికి దగ్గరయ్యేందుకు, తిరిగి వారిని ప్రచారంలో పాల్గొనేలా చేసేందుకే, బాబు ఆ స్ట్రాటజీ వేశారని, రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. హరికృష్ణ కూతురికి సీటిస్తే, అక్కను గెలిపించుకునేందుకైనా జూనియర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారానికి వస్తాడని, వచ్చే ఏపీ ఎన్నికల్లోనూ క్యాంపెయిన్‌ చేస్తారని, బాబు ఆలోచనగా చెబుతున్నారు. బాబు వ్యూహాత్మకంగా అడుగులేశారని అర్థం చేసుకున్న జూనియర్‌, మరి ఇన్ని తెలిసినా కూడా సుహాసిని తరపున ఎలా ప్రచారం చేయాలని అంతర్మథనం చెందుతున్నారు.

అంతేకాదు, కాంగ్రెస్‌-టీడీపీ పొత్తుతో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని టీఆర్ఎస్‌ అదే పనిగా ప్రచారం చేస్తోంది. ఈ పొత్తుపై జూనియర్‌ కూడా చాలా అహసనంగా ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తాత పార్టీ స్థాపించారని, మరి ఇఫ్పుడు అదే పార్టీతో చంద్రబాబు జతకట్టారని, ఒకింత ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో క్యాంపెయిన్‌ చేయడం, ఇబ్బందిగా ఫీలవుతున్నారు జూనియర్‌ ఎన్టీఆర్. ఇలా రకరకాల పరిణామాలు, ఇబ్బందుల నేపథ్యంలో, సుహాసిని తరపున ప్రచారం చేయడం, జూనియర్‌గా సంకటంగా మారింది. కానీ అక్కకు ప్రచారంచేయాల్సిందే. గెలిపించి తీరాల్సిందే. లేకపోతే, సొంత ఆలోచనలతో, సొంత అక్కకే దూరం జరిగాడన్న అపవాదు మూటకట్టుకోవాల్సి వస్తుందని మథనపడుతున్నాడు జూనియర్.

ఇన్ని అంతర్మథనాల నేపథ్యంలోనే, సుహాసినికి సీటు కన్‌ఫాం చేసిన తర్వాత పెద్దగా రియాక్ట్  కాలేదు జూనియర్‌. క్యాంపెయిన్‌కు రావాలని, డేట్స్ ఇవ్వాలని పార్టీ నేతలు కోరుతున్నా స్పందించలేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వస్తాడా అన్న ప్రశ్నకు, బాలయ్య దాట వేశారు. రాజమౌలి సినిమాతో జూనియర్‌ బిజీగా ఉన్నాడని, వారి డేట్స్‌ అడ్జస్ట్‌మెంట్‌ను బట్టి, రావొచ్చని డౌట్‌గా చెప్పారు. ఒకవేళ ప్రచారానికి వచ్చినా, కేవలం ఏ పార్టీ మీదా విమర్శ చేయకుండా, వ్యక్తిగతంగా సుహాసిని గురించే మాట్లాడే ఛాన్సుంది. ఏ పార్టీ పేరూ బయటకి చెప్పకుండా, ఏ పార్టీని విమర్శించకుండా, అక్క సుహాసినిని గెలిపించాలని, ముక్తసరిగా పిలుపునిస్తారని, సన్నిహితవర్గాలంటున్నాయి. మొత్తానికి అటు నాన్న అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్‌ ప్రభుత్వం, మరోవైపు నాన్నను దూరం పెట్టిన టీడీపీ ఇంకోవైపు తాత ఆత్మక్షోభ కలిగేలా కాంగ్రెస్‌తో పొత్తు ఇటువైపు అక్క సుహాసిని పోటీ చేయడం ఇలా అంతర్మథన క్రాస్‌రోడ్డులో నిలబడ్డారు జూనియర్. మరి వస్తాడని, టీడీపీ పెద్దలు కన్‌ఫామ్‌ చేస్తున్న, నేపథ్యంలో, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏం మాట్లాడతారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
 

Similar News