వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాల్గొంటారా? లేదా? అనే సంశంపై సందిగ్ధత నెలకొంది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొనాలని భారత ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ కు ఆహ్వానం పంపింది. అయితే దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శ్వేతసౌధం ప్రకటించింది.
‘భారత గణతంత్ర వేడుకల కోసం ఆ దేశం పంపిన ఆహ్వానం అందింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదనే చెప్పాలి’ అని అమెరికా అధ్యక్ష భవనం మీడియా కార్యదర్శి సారా శాండర్స్ తెలిపారు. అమెరికా-భారత్ మధ్య త్వరలో 2+2 వ్యూహాత్మక చర్చలు జరగనున్నాయని.. ఆ సమావేశం తర్వాతే భారత పర్యటనపై ట్రంప్ ఓ నిర్ణయానికి వస్తారని సారా ఈ సందర్భంగా తెలిపారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగా ఉందని, ఆ బంధాన్ని మరింత బలపర్చుకోవాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు.
అమెరికా, భారత్ మధ్య వ్యూహాత్మక, రక్షణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు వచ్చే నెలలో 2+2 చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో భారత విదేశాంగ, రక్షణ మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు మైక్ పాంపెయో, జిమ్ మాటిస్ పాల్గొననున్నారు. అసలైతే జులైలోనే ఈ చర్చలు జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల సెప్టెంబరు 6కు వాయిదా వేశారు. దిల్లీ వేదికగా ఈ సమావేశం జరగనుంది.