వాగ్ధానాల కంటే వాగ్భాణాలే సంచలనం... ఎందుకీ రాజకీయరచ్చ

Update: 2018-10-08 09:00 GMT

హామీల మూటల కంటే, మాటల మంటలే రేగుతున్నాయ్. ప్రామిస్‌ల కంటే శాపనార్థాలు ప్రతిధ్వనిస్తున్నాయ్. జనానికి ఏం చేస్తామో వేదికలపై వల్లె వేయాల్సిన నాయకలుు, ప్రత్యర్థులను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు. డెవలప్‌మెంట్‌ ఫార్ములాను పక్కనపెట్టి, సెంటిమెంట్‌లు‌‌‌ రగిలిస్తున్నారు. దీంతో తెలంగాణ పోరులో అభివృద్ది విధానాలపై చర్చ జరగాల్సిందిపోయి, నేతల తిట్ల మీద రచ్చ జరుగుతోంది. తెలంగాణ శాసన సభ సమరంలో, మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. తిట్లు, శాపనార్థాలతో వేదికలు దద్దరిల్లుతున్నాయి. మైక్‌లు విరిగేలా, చెవులు పగిలేలా, ప్రతి నాయకుడు తిట్ల పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కొత్తకొత్త తిట్లు వెతికి మరీ ప్రత్యర్థులను తూర్పారబెడుతున్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌, తన ప్రసంగాల్లో వాడివేడిని పెంచారు. వ్యంగ్యాస్త్రాలే కాదు, ప్రత్యర్థులను తిట్లతోనూ కుళ్లబొడుస్తున్నారు. ఎప్పుడు మాట్లాడిన ప్రత్యర్థులపై మాటలతోనే దాడి చేసే కేసీఆర్, ఈసారి డైలాగ్‌ డోస్‌ పెంచినట్టు అర్థమవుతోంది. ము‌ఖ్యంగా మహాకూటమిపై, కనివిని ఎరుగనిరీతిలో శాపనార్థాలు పెట్టేస్తున్నారు. నిజామాబాద్, నల్గొండ, వనపర్తి, ఇలా సభకు సభకూ పదునైన మాటలను సంధించారు. ఇక పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కామెంట్లు కూడా, మామూలు కాకరేపలేదు. సీఎంపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. మిగతా కాంగ్రెస్‌ నేతలు కూడా, జోగులాంబ, గద్వాల సభలో కత్తులతో కరవాలనం చేస్తూ, నోటితో పదవిన్యాసం చేయించారు. కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ దూషణభూషణలకు దిగారు.

వనపర్తి సభలో కేసీఆర్‌ తనపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, డీకే అరుణ ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు. ఇక రేవంత్‌ రెడ్డి, మొదటి నుంచి తీవ్రస్థాయిలో కేసీఆర్‌‌పై విరుచుకుపడుతున్నారు. తొడగొడుతున్నారు. కేసీఆర్‌ కుటుంబంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, సంచలనం సృష్టిస్తున్నారు. ఇలా ఎన్నికల వేళ, గల్లీ నుంచి సిటీ దాకా, చిన్నాచితకా లీడర్లు మొదలు, పెద్దపెద్ద నాయకుల వరకు, అందరి భాష తీవ్రంగానే ఉంది. కొత్తకొత్త తిట్లు పరిచయం చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతూ, అవతలి ప్రత్యర్థి ఇమేజ్‌ను వీలైనంతగా డ్యామేజ్‌ చేయాలని నోటికి పని చెబుతున్నారు. అయితే ఎన్నికల వేళ, ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు మామూలే కానీ, మరీ ఈ రేంజ్‌లో ఎవరూ ఊహించలేదు. ఇలాంటి పరుష పదజాలం వాడటంలో ఉద్దేశమేంటో తెలియక జనం తికమకపడుతున్నా, నాయకుల వ్యూహం మాత్రం పక్కాగా ఉంది. 

మామూలుగా ఎలక్షన్స్‌ టైంలో, వాగ్ధానాల జడివాన కురుస్తుంది. అధికార, విపక్షాల మధ్య సిద్దాంత వైరుధ్యాలు, విధానాలపై చర్చ జరుగుతుంది. కానీ సంచలనం కోసం నాయకులు, తిట్ల భాషను ప్రయోగిస్తున్నారని అనుకోవాలి. మీడియా, జనం అటెన్షన్‌ కోసం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తున్నారు. ఎందుకంటే, ఘాటైన వ్యాఖ్యలు చేస్తేనే, జనాలూ ఉర్రూతలూగిపోతారని నేతల నమ్మకం. అంతేకాదు, అవతలి ప్రత్యర్థిని తిడితే, పాలనాతీరు, వాగ్ధానాల గురించి చర్చ పక్కకుపోతుందని, అదే తమకు సేఫ్‌ లైన్‌గా కొందరు భావిస్తారు. ప్రతిపక్ష నాయకులు కూడా ప్రభుత్వానిధి నేతలపై, ఇలాంటి కామెంట్లే చేసి, సంచలనం సృష్టించి, ప్రజల దృష్టిని ఆకర్షించాలని తిట్ల దండకం వల్లెవేస్తారు. కులం, మతం, ప్రాంతం అన్న సెంటిమెంట్‌లు కూడా ఎన్నికల టైంలో బాగానే ప్రయోగిస్తున్నారు నేతలు. సకల అస్త్రాలతో తమవైపు జనాలు చూసేలా, సవాళ్లు విసురుతున్నారు. ప్రజలు కూడా ఇలాంటి వ్యాఖ్యలను ఆసక్తిగా గమనిస్తున్నారు. యూట్యూబ్‌లో నేతల తిట్ల దండకాలనే జనం ఎక్కువగా చూస్తున్నారని, వ్యూస్‌ కౌంట్‌ను బట్టి అర్థమవుతుంది.

Similar News