కేరళలో భారీ వర్షాలకు కారణం ఏంటి..?

Update: 2018-08-18 03:38 GMT

కేరళ భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. రాష్ట్రంలోని 44 నదులు పొంగిప్రవహిస్తుండటంతో అనేక డ్యాముల ప్రాజెక్టులను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఉత్తరాన కాసర్‌గోడ్‌ నుంచి దక్షిణం చివర ఉన్న తిరువనంతపురం వరకు అన్ని జిల్లాలపై వరుణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడు. 1924 అనంతరం ఇంత భారీగా వర్షపాతం రావడం ఇదే కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 

1924లో కేరళలో వరదలు బీభత్సం సృష్టించాయి. అప్పట్లో రాష్ట్రం ట్రావెన్కూర్‌, మలబార్‌ ప్రాంతాలుగా ఉండేది. ఆ ఏడాది వర్షాకాలంలో మొత్తం 3348 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. తర్వాత ఇన్నేళ్లకు ఆ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు 2 వేల మిల్లీమీటర్లపై వర్షపాతం నమోదుకావడం విశేషం. తాజా వర్షాలతో కొచ్చిన్‌ విమానాశ్రయాన్ని కూడా మూసివేశారంటేనే.. తీవ్రత ఏ స్తాయిలో ఉందో తెలుస్తోంది. 

కేరళలో గత రెండు దశాబ్దాలుగా పర్యావరణ విధ్వంసం కొనసాగింది. పశ్చిమకనుమలు పర్యావరణ పరంగా అతి సున్నితమైన ప్రాంతాలు. వీటిని పరిరక్షించాలని ప్రముఖ పర్యావరణవేత్తలు సూచించారు. అయితే, కేరళలోని అప్పటి  యూడీఎఫ్‌ ప్రభుత్వం ఈ నివేదికను పూర్తిగా తిరస్కరించింది. కొండపైన ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు, చెట్ల నరికివేతతో పైనుంచి నీటి ప్రవాహవేగం రెట్టింపయింది. దీంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో అపారనష్టం సంభవించింది.

పశ్చిమకనుమల్లో పర్యాటకం బాగా పెరిగింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో సున్నిత ప్రాంతాల్లో కాంక్రీటు నిర్మాణాలును నిర్మించారు. దీంతో నీటిని నిల్వచేసుకునే సామర్థ్యాన్ని కొండ ప్రాంతాలు కోల్పోవడం జరిగింది. కొండ ప్రాంతాలపై పెరిగిన జనాభాకు అనుగుణంగా అటవీప్రాంతాలను నిర్మూలించి.. ఇళ్లను నిర్మించారు. ఇది కూడా కేరళలో ఇప్పుడు జరుగుతున్న విపత్తుకు మరో కారణం.

కేరళలో గత పదేళ్ల నుంచి ఇసుకను విచ్చలవిడిగా తవ్వి తరలించారు. ఇసుక తవ్వకాలతోనే కొన్ని వందల కోట్లను అక్రమంగా సంపాదించారు. నదీగర్భాన్ని తవ్వివేయడంతో వరదనీటిని నిల్వచేసుకునే సహజత్వాన్ని నదీప్రాంతాలు కోల్పోయాయి. దీంతో ప్రవాహవేగం పెరిగి జనావాసాలపై నదీజలాలు ఎగిసిపడ్డాయి. వీటితో పాటు అంతర్జాతీయంగా వాతావరణంలో పెరుగుతున్న కర్బన ఉద్గరాలు, వాతావరణ మార్పులు కూడా కేరళలోని వరదలు, విపత్తులకు దోహద పడుతున్నాయి.
 

Similar News