ఆ మార్గం రద్దీగా ఉంటుంది.....ప్రధాన మార్గాలను కలుపుతూ వెళ్లే ఆ దారిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రాజధానిగా మారిన విజయవాడలో మరో పెను ప్రమాదం పొంచి ఉందా...? అందరు అనుకుంటున్నట్లుగానే ప్రమాదం జరిగిన తరువాతే అధికారులు హడావుడి చేస్తారా...? వియంసి మొద్దు నిద్ర పోతున్నదా....? ఇంతకీ ఏమిటా డేంజర్ బెల్స్...
విజయవాడ నగరం.... చుట్టూ కొండలు... వాటి మధ్య ప్రవహించే కాల్వలతో చూసేందుకు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. కాల్వలపై ఉన్న వంతెనలపై నుంచి నగరవాసుల జీవనం సాగుతుంది. నిత్యం ఏదొ ఒక వంతెన దాటుతునే వెళ్ళాల్సిన పరిస్థితి.... నగరం రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత నగరం విస్తరించటంతో పాటు జనాభా పెరిగింది. వాహనాల రద్దీ రెట్టింపు అయ్యింది. దీనితో నగర జీవితం కొంత బిజీగా మారిందనే చెప్పాలి. నగరం నుంచి రైవస్ కాల్వ ప్రవహిస్తుంది. నగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తుంది కాబట్టి చిన్న చిన్న వంతెనలను నిర్మించారు. ఇప్పుడు ఈ వంతెనలే ప్రమాద ఘంటికలుమోగిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు వంతెన, కొత్త వంతెన, హనుమాన్ పేట వద్ద ఉన్న వంతెనలు మరి కొంత కాలం మన్నుతాయి. కాని లెనిన్ సెంటర్ నుంచి గాంధీనగర్ వైపు వెళ్ళే దారిలో ఉన్న వంతెన పరిస్థితి దారుణంగా ఉంది. ఈ వంతెన ఒక ప్రధాన రహదారి... ఎందుకంటే ఇటు లెనిన్ సెంటర్ నుంచి గాంధీనగర్ వైపు వెళ్ళే వారికి ఇదే ప్రధాన రహదారి. ఒక్కో సారి మంత్రుల కాన్వాయ్ లు ఈ మార్గం నుంచే వెళ్ళుతూ ఉంటాయి. ఈ వంతెన పై ఇప్పటికే ఫుట్ పాత్ లేదు, పైగా రిపేర్ లో ఉంది అని విజయవాడ మున్సిపాల్ కార్పొరేషన్ వారు ప్రత్యేక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అంతే కాదు ...చిన్న చిన్న పెచ్చులు ఊడుతు.... బాబోయ్ అనే విధంగా కనిపిస్తుంది. వీటితొ పాటు వంతెనకు ఏర్పాటు చేసిన ఐరన్ గ్రిల్ శిథిలం అయిపోయి కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ పట్టించుకున్న నాథుడు లేడు. వియంసి పట్టించుకోదు, రాష్ట్ర ప్రభుత్వానికి అంత తీరికా లేదు. ఈ వంతెనపై నిర్లక్ష్యం వహించడం పట్ల స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మిస్తామని అంటున్నారు... అంతకంటే ముందు శిథిలావస్థలో ఉన్న ఈ వంతెన పై దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విద్య, వాణిజ్య, ఆర్ధిక, రాజకీయ...రాజధాని విజయవాడ. ఇటువంటి నగరంలో ప్రజలు ప్రమాదం అంచుల మధ్య నడుస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది ?...ఏదైనా ప్రమాదం జరిగిన తరువాత హడావుడి చేసి నష్టపరిహరం ప్రకటించే బదులు ప్రమాదం రాకుండా చూస్తే మంచిదని నగరవాసులు సూచిస్తున్నారు. రాజధాని నగరం నడిబోడ్డున ఉన్న ఈ వంతెన పై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవపరం ఉంది. ఇకనైనా ఈ వంతెనను బాగుచేయించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజల ఇబ్బందులను చూసైనా అటు వియంసి గాని, రాష్ట్ర ప్రభుత్వం గానీ వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.