పార్ట్ టైం పొలిటిషియన్ అన్నారు. మేకప్ ఫేసులు ఎండా వాన, దుమ్ముధూలిలో ఏం తిరుగుతాయని సణిగారు. అసలు ఆ ఫైర్ బ్రాండ్ లీడర్, పార్టీలోనే ఉన్నారా అని, ప్రశ్నించారు. ఎన్నికల్లో తిరగగలరా అని నొసలు చిట్లించారు. వాటన్నింటికీ సమాధానంగా కత్తులు దూస్తున్నారామె. మాటల చురకత్తులు విసురుతున్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా పాలమూరులో చెలరేగిపోయారు. దేవుడిచ్చిన అన్నయ్యపై యుద్ధం మొదలుపెడుతున్నానని, గాంధీభవన్ సాక్షిగా, సమర సంకేతాలిచ్చిన, ఆ బంగారు చెల్లెలు నిజంగానే, ప్రచారక్షేత్రంలో రణభేరి మోగిస్తున్నారు.
మొన్నటి వరకు విజయశాంతి ఎక్కడన్నారు. అసలు కాంగ్రెస్‌లో ఉన్నారా అని సణిగారు. పార్ట్ టైం పొలిటిషియన్ అంటూ చణుకులు విసిరారు. సినిమా తార, దుమ్ముధూలి, ఎండా వానకు ఎక్కడ తట్టుకుంటారని నవ్వేశారు. ఆ విమర్శలకు జవాబు ఇదేనన్నట్టుగా, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ దుమ్మురేపుతున్నారు రాములమ్మ. సినిమా స్టైల్లో డైలాగులు దంచేస్తున్నారు. రాములమ్మ చిత్రంలో దొరలపై పోరాడే ధీర వనితగా నటించానని, ఇప్పుడు అదే దొరలపై నిజంగానే పోరాటం చేస్తున్నానని ప్రసంగిస్తున్నారు విజయశాంతి. రాములమ్మ సినిమాలో రామిరెడ్డి పాత్రలా, కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మాట్లాడుతున్నారు.
జోగులాంబ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినవారిలో, విజయశాంతి కూడా ఉన్నారు. స్టార్ క్యాంపెనర్‌గా ఆమెకు బాధ్యతలు అప్పగించడంతో, నాటి నుంచి క్యాంపెన్‌లో చెలరేగిపోతున్నారు రాములమ్మ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను చుట్టేస్తూ, హోరెత్తించే ప్రసంగాలు చేశారు. కేసీఆర్‌ను దేవుడిచ్చిన అన్నగా భావించానని, కానీ తనను బలి పశువు చేసి, పార్టీలోంచి పొమ్మనలేక పొగపెట్టారని విమర్శించారు రాములమ్మ. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీనని, అలాంటి సోనియాపై కేసీఆర్ విమర్శలు చేశారన్నారు విజయశాంతి. తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్సేనని, తెలంగాణ పునర్ నిర్మాణం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు రాములమ్మ.
మొత్తానికి స్టార్ క్యాంపెయినర్‌గా, తనకు కాంగ్రెస్ అప్పగించిన బాధ్యతలను విజయశాంతి సమర్థంగా నిర్వహిస్తున్నారని, సుడిగాలి పర్యటనలు చేస్తూ, కార్యకర్తల్లో హుషాురు నింపుతున్నారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. అయితే విజయశాంతి, ఏ స్థానంలోనూ పోటీ చేయడం లేదని తెలుస్తోంది. అధిష్టానం ఆఫర్ చేసినా, తిరస్కరించారని సమాచారం. ఏదైనా ఒక స్థానంలో పోటీ చేస్తే, ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితమవుతానని, తాను తెలంగాణ మొత్తం క్యాంపెయిన్ చేద్దామనుకుంటున్నానని, హైకమాండ్‌కు ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో, విజయశాంతిని తప్పనిరిగా ఎంపీగా బరిలో నిలబెడతారని సమాచారం. అయితే కాంగ్రెస్ డజను మంది సీఎం అభ్యర్థుల్లో రాములమ్మా ఒకరని, కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.