టీడీపీతో పొత్తు.. గెలిస్తే ఉత్తమ్ సీఎం..

Update: 2018-07-30 05:39 GMT

మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతున్నాయ్. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సీఎం అనడం వివాదాస్పద మవుతున్నాయ్. అక్కడితో ఆగని సర్వే సత్యనారాయణ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయడం చర్చనీయాంశంగా మారాయ్.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోడుప్పల్‌లో జరిగిన కాంగ్రెస్‌ సభలో టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా సర్వే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ కాబోయే సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే మహాంకాళి బోనాల నాటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా అమ్మవారిని దర్శించుకుంటారని జోస్యం చెప్పారు. అక్కడితో ఆగని సర్వే సత్యనారాయణ సీఎం పదవి చేపట్టిన తర్వాత తమను మరచిపోవద్దంటూ ఉత్తమ్‌పై ఛలోక్తులు విసిరారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం పదవిపై పలు సార్లు వివాదాస్పదమైంది. బస్సు యాత్ర సందర్భంగా కాబోయే సీఎం ఉత్తమ్ అని కార్యకర్తలు సంబోధించడంతో సీనియర్ నేత జానారెడ్డి, షబ్బీర్‌ అలీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బోడుప్పల్ సభలో సర్వే సత్యనారాయణ, క్యామ మల్లేశ్‌లు ఉత్తమ్ కాబోయే సీఎం అనడంతో వారించేందుకు కూడా ప్రయత్నించలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ చీఫ్ ముందే 2019 ఎన్నికల్లో పొత్తుపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగని సర్వే కేంద్ర మంత్రి పదవి తనకు అడ్వాన్స్‌ రిజర్వ్ చేశారంటూ చెప్పుకొచ్చారు. 

బంగారు తెలంగాణ అంటే కేసీఆర్‌ కుటుంబమే బంగారమవుతోందంటూ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఇప్పటికిపుడు ఎన్నికలొస్తే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే తెలంగాణ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డేనని సర్వే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయ్. గతంలో వివాదం రేపిన సీఎం పదవి తాజా వ్యాఖ్యలతో మళ్లీ వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. 
 

Similar News