ఆయనో నియోజక వర్గం ఎమ్మెల్యే ప్రత్యర్ధిని ఓడించి భారీ మెజారిటీతో గెలిచారు కానీ ఆ గౌరవం గుర్తింపు ఆయనకు దక్కడం లేదు కింద పడినా పై చేయి మాదే అంటున్న టిడిపి అక్కడ కంటి సైగతో పరిస్థితులను శాసిస్తోంది. కాలం కలసి రానప్పుడు మౌనమే సమాధానమనుకున్నారో ఏమో సైలెంట్ గా ఉంటున్న ఆ ఎమ్మెల్యే పార్టీ అధ్యక్షుడి రాకతో మళ్లీ కాస్త యాక్టివ్ అవుతున్నారు.
తూర్పు గోదావరిలోని తునిలో వైసీపీ ఈసారీ పాగా వేస్తుందా? యనమల కంచుకోటగా ఉన్న ఈ నియోజక వర్గంలో తొలిసారిగా గెలిచి వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చరిత్ర సృష్టించారు. తెలుగు దేశంలో నెంబర్ టూ అయిన ఆర్థిక మంత్రి యనమల ఆ నియోజక వర్గాన్ని కంటి సైగతో శాసిస్తారు అలాంటి నియోజక వర్గంలో యనమల సోదరుడు యనమల కృష్ణునిపై గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు లేదు కింద పడ్డా తనదే పై చేయి అనే తీరులో వ్యవహరించే యనమల వర్గం అప్పటినుంచి దాడి శెట్టి రాజాను టార్గెట్ చేసింది. అప్పటినుంచి ఆయనకు ఎమ్మెల్యే పదవే ముళ్ల కిరీటంగా మారింది. ఆయన పేరుకే శాసనసభ్యుడు. ఆ నియోజకవర్గంలో చిన్నపాటి బడ్డీకొట్టు కూడా ప్రారంభించలేని అసమర్ధత లోకి నెట్టేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఓటమి ప్రతీకారం తీర్చుకుంటున్న యనమల సోదరుడు నియోజక వర్గంలో దాడిశెట్టి రాజా ప్రభావం అంటూ లేకుండా చేసేశారు ఆయన ఎమ్మెల్యే అయినా ఆయన మాట చెల్లని వాతావరణం కల్పిస్తున్నారు. ఆయన కటౌట్లు, ఫ్లెక్సీలు ఎక్కడా కనపడవు ఎమ్మెల్యే హోదాలో కనీసం ఆయనకు స్వాగత తోరణాలూ కనపడవు. ఒకవేళ ఏదైనా కార్యక్రమానికి ఎవరైనా ఎమ్మెల్యేకు స్వాగత ఫ్లెక్సీ పెడితే ఆ మరుసటి రోజే దాన్ని కప్పేసేలా టిడిపి ఫ్లెక్సీలు వెలుస్తాయి. నాలుగేళ్ల కాలంలో ఒక్కసారి కూడా దాడిశెట్టి రాజాను ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు ప్రారంభోత్స వాలు, శంకు స్థాపనలకు ఆహ్వానించలేదు.
ఇన్నేళ్ళ కాలంలో ఆయన తన బలాన్ని, దర్పాన్నీ ఓసారి ప్రదర్శించారు. అది దివీస్ కర్మాగార ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్ ఉద్యమం చేపట్టినప్పుడు భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించి సత్తా చూపారు. ఆ తర్వాత నుంచీ స్తబ్దుగా ఉంటున్నా మళ్లీ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పుణ్యమాని దాడిశెట్టి రాజా మళ్లీ నలుగురిలోనూ కనపడుతున్నారు తుని నియోజక వర్గంలో జగన్ వెన్నంటే తిరిగే అవకాశం దొరికింది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన యనమల రామకృష్ణుడు అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ క్యాబినెట్ హోదాలోనే ఉండేవారు యనమలకు నియోజక వర్గంపై తిరుగులేని పట్టుంది.
తుని రాజకీయాలే గమ్మత్తుగా ఉంటాయి. 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తుని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున అప్పటి డీజీపీ ఎం.వి భాస్కర రావు సోదరుడు మేజర్ చలపతిరావు ని యనమలపై బరిలోకి దింపింది కాంగ్రెస్. అసలే డీజీపీ కావడంతో పోలీసు బలగం అంతా తునిలో మోహరించింది. ఆ హడావుడికి సహజంగానే యనమల వర్గం కొంచెం టెన్షన్ పడింది. ఎన్నికల ప్రచారం చివరి రోజు చంద్రబాబునాయుడే స్వయంగా తుని వచ్చి నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించి యనమలకు మద్దతుగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పోలీసు అధికారులెవరూ ఉండరంటూ కామెంట్ చేసి చంద్రబాబు టిడిపి కేడర్ లో ధైర్యం నింపారు. యనమలకు ఆ నియోజక వర్గంలో పట్టు అలాంటిది.. ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్ నియోజక వర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై నిశితంగా విమర్శలు చేస్తున్నారు.. తోట త్రిమూర్తులు వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించినందున ఆయన్ను మినహాయించి మిగిలిన వారందరినీ కడిగి పారేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ టిక్కెట్ ను అంగబలం, అర్ధబలం ఉండి, గత ఎన్నికల్లో గెలిచిన దాడి శెట్టి రాజాకే దక్కనుంది. తూర్పుగోదావరిలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు ఇవ్వాలని వైసిపీ నిర్ణయించుకుంది.