మహాకూటమి టార్గెట్‌గా టీఆర్ఎస్ విమర్శల దాడిని పెంచింది. కాంగ్రెస్, టీడీపీ మైత్రి బంధాన్ని ఎన్నికల ప్రచారంలో ఎండగడుతోంది. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తోంది. మహా కూటమికి దమ్ముంటే తెలంగాణలో చంద్రబాబుతో ప్రచారం చేయాలని సవాల్ విసురుతోంది. తెలంగాణలో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడుక్కుతోంది. మహాకూటమి ఇటు టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నాడు తెలంగాణ ఏర్పాటును, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని వ్యూహాత్మకంగా గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
టీడీపీ, కాంగ్రెస్, జన సమితి, సీపీఐ, మహాకూటమి పేరుతో జట్టు కట్టడంతో అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఉద్దేశపూర్వకంగా బద్నాం చేస్తుంది. ప్రగతి నివేదన సభలో పార్టీ అధినేత కేసీఆరే చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేయడంతో అదే బాటలో టీఆర్ ఎస్ శ్రేణులు నడుస్తున్నాయి. మరోసారి తెలంగాణలో అధిపత్యానికి సీమాంధ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో భాగంగా
మహాకూటమికి ఎన్నికల వనరులను చంద్రబాబే సమకూరుస్తారని ఆరోపిస్తున్నారు. మహా కూటమి నేతలకు చంద్రబాబును తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేయించే సత్తా ఉందా అంటూ గులాబీ నాయకులు సవాల్ విసురుతున్నారు. మహా కూటమి సాకుతో చంద్రబాబుపై చేస్తున్న ఎదురుదాడి అధికార టీఆర్ ఎస్ కు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో వేచి చూడాలి.