కంచుకోటల్లో దూసుకెళ్లేందుకు, గులాబీదళం సరికొత్త వ్యూహాలు వేస్తోంది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ కట్టబెట్టిన స్థానాలపై గురిపెట్టింది. ఈసారి మరింత ఎక్కువ ఆధిక్యంతో గెలిచి, గులాబీ జెండా రెపరెపలాడించాలని స్ట్రాటజీలు వేస్తోంది. రాష్ట్ర విభజన, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 2014 ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసింది తెలంగాణ రాష్ట్ర సమితి. 63 స్థానాల్లో గెలుపొంది, కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 30 స్థానాల్లో 20వేలకు పైగా ఓట్ల ఆధిక్యాన్ని నమోదు చేసింది. తాజాగా కేసీఆర్ ప్రకటించిన, 105 మంది అభ్యర్థుల జాబితాలో ఈ 30 స్థానాల్లోని 27 ఉన్నాయి.
తెలంగాణలో రికార్డుస్థాయిలో మెజారిటీ సాధించిన నాయకుడు, తన్నీరు హరీష్ రావు. సిద్దిపేటలో తనకు తిరుగులేదని నిరూపించాడు. 2014 ఎన్నికల్లో సిద్దిపేట నియోకవర్గంలో హరీశ్‌రావు సాధించిన మెజారిటీ 93 వేల 328 ఓట్లు. గతంలో సిద్దిపేట నుంచి ఆరుసార్లు, విజయం సాధించారు కేసీఆర్. ఆ పరంపరను కొనసాగిస్తూ, సిద్దిపేటలో హరీష్ విజయం సాధించారు. అందుకే సిద్దిపేట, గులాబీదండుకు తిరుగులేని కంచుకోటగా మారిందని పార్టీ వర్గాలంటాయి. ఈసారి మళ్లీ హరీష్ రావే, పోటీ చేస్తుండటంతో మెజారిటీ మరింత పెరుగుతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. సిద్దిపేట తర్వాత టీఆర్ఎస్‌కు అత్యధిక మెజారిటీనిచ్చిన నియోజకవర్గం వర్ధన్నపేట. 86 వేల 883 ఓట్ల ఆధిక్యంతో విజయబావుగా ఎగరేశారు ఆరూరి రమేశ్. తిరిగి అదే రేంజ్‌లో దూసుకెళ్లాలని కేసీఆర్, దిశానిర్దేశం చేశారు. దీంతో వర్థన్నపేటలో వాడవాడలా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఆలూరి రమేశ్.
కేసీఆర్ తమకు మరో కంచుకోటగా భావిస్తున్న స్థానం పెద్దపల్లి. గత ఎన్నికల్లో 62 వేల 677 ఓట్ల మెజారిటీతో దాసరి మనోహర్‌రెడ్డి గెలుపొందారు. ఈ స్థాయిలో ఓట్లున్నాయి కాబట్టి, ఈ నియోజకవర్గంపై దీమా ఉంది గులాబీదళం. ఈసారి టఫ్ ఉంటుందని భావిస్తున్నప్పటికీ, విజయం తమదేనని లెక్కలేస్తోంది. మంచిర్యాలలో ఎన్.దివాకర్‌రావు 59,250 ఓట్ల ఆధిక్యంతో విజయనాదం హోరెత్తించారు. ఈ సారి సైతం మంచి మెజారిటీని ఆత్మవిశ్వాసంగా ఉన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్య మెజారిటీ 58 వేల 829. ఈసారి అక్కడ పార్టీ బలంగానే ఉన్నా.. అదే నియోజకవర్గానికి చెందిన కీలక నేత వర్గంతో విభేదాలున్నాయి. ఈ పరిణామంతో మెజారిటీపై ప్రభావం పడే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు.
హుజూరాబాద్‌లో 57 వేల 37 ఓట్ల ఆధిక్యంతో ఈటల రాజేందర్ విజయఢంకా మోగించారు. నియోజకవర్గంలో ఊరూరికీ అభివృద్ధి పనులు జరిగాయని.. ఆశాజనక ఫలితం వస్తుందని భరోసా వ్యక్తంచేస్తున్నారు రాజేందర్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం. దాస్యం వినయ్‌భాస్కర్ మెజారిటీ, 56 వేల 304. ప్రస్తుత ఎన్నికల్లో అసమ్మతి స్వరం బాగా వినిపిస్తోంది. అయితే ఎన్నికల నాటికి సమసిపోతుందని నాయకులు భావిస్తున్నారు. వరంగల్ తూర్పు. 2014లో టీఆర్ఎస్ తరపున బరిలోకి సత్తా చాటారు కొండా సురేఖ. దాదాపు 55 వేల 85 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సారి ఇంకా ఆమెకు టికెట్ రాలేదు. టీఆర్ఎస్ నుంచి మరో అభ్యర్థి రంగంలో ఉన్నా.. పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇక్కడ వర్గ విభేదాలు, ఇతర సమస్యలు టెన్షన్ పుట్టిస్తున్నాయి.
చొప్పదండిలో బొడిగె శోభ 54 వేల 981 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ సారి శోభకు తెరాస టికెట్ లభించలేదు. పార్టీ బలంగా ఉన్నందున ఈ స్థానాన్ని అదే స్థాయిలో నిలబెట్టుకోవాలని, రకరకాల వ్యూహాలు వేస్తున్నారు కేసీఆర్. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డి 53 వేల 625 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అక్కడ పార్టీ పటిష్ఠంగా ఉన్నా.. నేతల మధ్య సమన్వయలోపాలు ఇబ్బందికి కారణమవుతున్నాయి. సిరిసిల్లలో కల్వకుంట్ల తారక రామారావు, విజయకేతనం ఎగురవేశారు. కేటీఆర్‌కు 53004 మెజారిటీ వచ్చింది. మంత్రిగానేగాక టీఆర్ఎస్‌లో, కీలక స్థానంలో ఉన్న ఆయన ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కేటీఆర్ మెజారిటీ మరింత పెరుగుతుందని ఆశాభావంతో ఉన్నామని కేటీఆర్ అంటున్నారు.
బెల్లంపల్లిలో 52 వేల 528 ఓట్ల ఆధిక్యంతో దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధులతో విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. మానకొండూరులో రసమయి బాలకిషన్ 46 వేల 922 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ స్థానికంగా ఉన్న అసంతృప్తి, భారీగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో తిరుగులేని పట్టున్న నాయకుడు తమ్మల నాగేశ్వర రావు. పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మల భారీ మెజారిటీ సాధించారు. 45 వేల 676 ఓట్లతో ఆధిక్యం పొందారు. పార్టీ బలంగా ఉన్నందున తుమ్మలకు మంచి మెజారిటీని ఆశిస్తున్నారు కేసీఆర్.
మేడ్చల్‌లో సుధీర్‌రెడ్డి 43455 ఓట్లతో విజయఢంకా మోగించారు. ఈసారి మాత్రం ఆయనకు టికెట్ లభించలేదు. అక్కడ పార్టీ పరిస్థితి బాగానే ఉన్నా అభ్యర్థి ఎంపిక మీదనే ఫలితం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇక గత ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించిన స్థానాల విషయానికి వస్తే, మునుగోడు 38055 ఓట్ల ఆధిక్యం, దుబ్బాక 37925, బాల్కొండ 36248, జుక్కల్ 35507, ఆలేరు 33477, జనగామ 32695, సంగారెడ్డి 29522, బోథ్ 26993, నిజామాబాద్ రూరల్ 26547, చెన్నూరు 26164, సికింద్రాబాద్ 25979, కరీంనగర్ 24754, ఎల్లారెడ్డి 24009, బాన్స్‌వాడ 23930, కోరుట్ల 20585లలోనూ టీఆర్ఎస్ మంచి మెజారిటీ నమోదు చేసింది. వీటిలో చెన్నూరు మినహా మిగిలిన అన్నిచోట్లా తాజా మాజీ అభ్యర్థులనే ఎంపిక చేశారు. ఆయాచోట్ల అనుకూల ఫలితాలను ఆశిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి. అందుకు అనుగుణంగా, రకరకాల స్ట్రాటజీలు అమలు చేస్తోంది.