మరోసారి అధికారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ.. తమ వ్యూహాలకు పదును పెట్టింది. ప్రజాకర్షక పథకాలను ప్రజల ముందుంచేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. పాత పథకాలను వల్లె వేస్తూనే.. కొత్త వరాలను కుమ్మరించేందుకు రెడీ అవుతోంది. 15 మందితో కూడిన మేనిఫెస్టో కమిటీ..కాంగ్రెస్‌కు దీటుగా మ్యానిఫెస్టోను వండి వారుస్తోంది. ఎలా ఉండబోతోంది గులాబీ గులాబ్ జామ్.
అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి.. వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు చైర్మన్ గా 15 మంది సభ్యులతో మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు. శనివారం టీఆర్ఎస్ భవన్‌లో భేటీ అయిన కమిటీ.. వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను విశ్లేషించింది.
ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ ఇస్తున్న హామీలను కూడా.. ఈ సమావేశంలో చర్చించారు. దీంతో కేసీఆర్ సూచన మేరకు.. ప్రజాకర్షక మ్యానిఫెస్టో రూపొందించే దిశగా కసరత్తు చేస్తున్నారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులతో పాటు వివిధ వర్గాలను ఆకర్షించే విధంగా 20 కి పైగా అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 సంక్షేమ పథకాలకుపైగా ఇప్పటికే అమలవుతున్నాయి. ఏడాదికి వీటికయ్యే వ్యయం మొత్తం అక్షరాల 52 వేల కోట్లు. ఈ స్కీముల లబ్దిదారులు 2 కోట్లమంది. అంటే, ప్రతి వ్యక్తికి నెలకు 2166 లబ్ది చేకూరుతోంది. కుటుంబంలో నలుగురు ఉంటే, ప్రతి ఫ్యామిలికీ, నెలకు అందుతున్న మొత్తం 8664 రూపాయలు. ఏడాదికి లక్షా మూడు వేల 968 రూపాయలు. వీటికి తోడుగా, మరిన్ని పథకాలను ప్రణాళికలో చేరుస్తోంది టీఆర్ఎస్. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రణాళిక కంటే మించి, అంటే రెట్టింపు ఇచ్చేందుకు సిద్దమైంది. ఇందూరు ప్రజాశీర్వాద సభలోనూ ఇదే, విషయం స్పష్టం చేశారు కేసీఆర్.