కోటి విద్యలు కూటి కొరకే.....కోటి విన్యాసాలు ఓటు కొరకే అని చెప్పుకోవాలిప్పుుడు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతోన్న టిఆర్ఎస్ అభ్యర్ధులు, కొత్త పంథా ఎంచుకున్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లగడటమే కాదు....ఓటర్లను ఆకట్టుకునేందుకు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఒకరు చనిపోయిన శవయాత్రల్లో పాడెలను మోస్తుంటే...మరొకరు గడ్డాలు గీయడం...స్నానాలు చేయించడం చేస్తున్నారు. ఇలా గులాబీ అభ్యర్ధులు క్యాంపెయినింగ్‌లో చిత్ర విచిత్రాలు చూపెడుతున్నారు. దీంతో ఎన్నికల వేళ నేతల ఈ సిత్రాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు జనం.
107 మంది అభ్యర్ధులను ప్రకటించి గులాబీ బాస్ కేసీఆర్...అందరినీ ప్రచారంలో నిమగ్నం చేశారు. గత నెలరోజులుగా అభ్యర్ధులంతా నియోజకవర్గాలకు పరిమితమయ్యారు. ప్రచారాన్ని ఉదృతం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడ ప్రజా ఆశీర్వాద సభలతో జిల్లా టూర్‌లు ప్రారంభించారు. ఇక పార్టీ అభ్యర్ధులంతా ఇంటింటి ప్రచారంతో గ్రామాల్లో కలియతిరుగుతున్నారు. ఇతర పార్టీల అభ్యర్ధులు ఖరారు కాకముందే నియోజకవర్గాల్లో ఒక రౌండ్ ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు నేతలు. అందుకోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అసలు పార్టీలో టిక్కెట్ దక్కుతుందా లేదా అన్న టెన్షన్ లో నేతలుండగా....గులాబీ బాస్ కెసీఆర్... సిట్టింగ్ లకే మళ్లీ టిక్కెట్లు ఖరారు చేయడంతో నేతలంతా ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. గత నాలుగేళ్లలో సంక్షేమ, అభివృద్ది కార్యక్రమలను ప్రజలకు వివరిస్తూ తిరుగుతున్నా....అభ్యర్ధిని..పార్టీని గుర్తు పెట్టుకోవాలంటే ఓటర్లను ఆకర్షించాల్సిందే. దీంతో ఏదో రకంగా వారిని ప్రసన్నం చేసుకునేందుకు సర్కస్ ఫీట్లు చేస్తున్నారు అభ్యర్ధులు.
ఇక ఇలాంటి ప్రచారం విషయంలో భూపాల్‌పల్లి అభ్యర్ధి మధుసూదనా చారి ముందున్నారు. మొదట్లో ఆయన మీద నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలియగానే పల్లెలు, గూడేల్లో పల్లెనిద్రలు చేపట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక టిక్కెట్ మళ్లీ తనకే దక్కడంతో మరింత జోష్ పెంచారు మధుసూదనా చారి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా, వెళ్తున్న ఆయనకు ఓ శవయాత్ర కన్పిండంతో అక్కడికెళ్లి పాడె మోశారు. అంతేకాదు మరికొన్ని చోట్ల వృద్దులకు భోజనం తినిపించడం, మంగళి షాపులో గడ్డాలు గీయడం ఎన్నికల్లో, ఈయన పడుతున్న పాట్లను చూసి జనమంతా చర్చించుకుంటున్నారట.
మహబూబ్ నగర్ అభ్యర్ధి శ్రీనివాస్ గౌడ్ కూడా బట్టలుకుట్టడం, ఓ ఇంట్లో మహిళకు వంటపనిలో సాయం చేయడం లాంటి పనులు చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఇక ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్ధి జీవన్ రెడ్డి సైతం పాడెమోశారు. ఇక ఇల్లందు అభ్యర్ధి కోరం కనకయ్య, అందరికంటే రెండాకులు ఎక్కువే చదివారు. ఓ తండాలో పర్యటిస్తున్న సమయంలో అక్కడే స్నానం చేస్తున్న యువకుడికి నీళ్లు పోస్తూ ఓట్లడిగారు. దీంతో అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. తుంగతుర్తి అభ్యర్ధి గాదరి కిషోర్ సైతం రాజకీయాలను బాగానే ఒంటపట్టించుకున్నారు. ప్రచారంలో భాగంగా ఓ సెలూన్ లోకి వెళ్లిన ఆయన, ఓ వృద్దుడికి కటింగ్ చేస్తూ తమ పార్టీకే ఓటేయాలని అడిగారు.
మొత్తానికి ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ పార్టీ అభ్యర్ధులు, చిత్ర విచిత్ర విన్యాసాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్నికల సమయంలో ఈలాంటివి మామూలే అయినా, రానున్న రోజల్లో ఈలాంటి విన్యాసాలు ఇతర పార్టీ నేతలవి కూడా ఎన్ని చూడాల్సి వస్తుందోనని జనం చర్చించుకుంటున్నారు.