కారు జోరుకు కమలం కళ్లెం వేస్తుందా?

Update: 2018-10-01 12:00 GMT

దేశంలో మోడీ, షా ద్వయం నడుస్తుందని చెప్పుకుంటున్నా... తెలంగాణలో కమలదళం వికసించనుందా? అధికార పార్టీ టీఆర్ఎస్ జోరుకు కళ్లెం వేస్తుందా.. మహాకుటమిని ధీటుగా ఎదుర్కొంటుందా? ఒంటరి పోరుకు సై అంటున్న కమలదళం అధికార దిశగా అడుగులు వేయగలదా? అసలు తెలంగాణలో బీజేపీ బలమెంతా? అసలు రాష్ట్రంలో కమలవికాసం సాధ్యమవుతుందా? మోడీ, షా జైత్రయాత్రకు తెలంగాణలో బ్రేక్ పడకుండా రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఎలా పనిచేస్తుంది? 

తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్నారు కమలనాథులు. 2014 ఎన్నికల్లో 45 స్థానాలకు పోటీ చేసి గెలిచిన స్థానాలు ఐదు. మరో పదిచోట్ల రెండో స్థానంలో నిలిచింది. 2009 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ... తెలంగాణలోని 119 స్థానాల్లో 110 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలిపింది... ఈసారి కూడా బీజేపీ 119 స్థానాల్లో సొంతంగానే బరిలోకి  దిగి అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. తెలంగాణలో 30 స్థానాల్లో బీజేపీ తన ప్రభావాన్ని చూపించబోతోందంటున్నారు కమలనాథులు. 

గతంలో బీజేపీ గెలుచుకున్న స్థానాలను, బీజేపీకి ఉన్న అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుని విశ్లేషిస్తే హైదరాబాద్‌లోని అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, ఉప్పల్, మల్కాజిగిరితో పాటు... కరీంనగర్, కల్వకుర్తి, నిజామాబాద్ అర్బన్, ముథోల్, ఆదిలాబాద్, సూర్యాపేట, భూపాలపల్లిలో గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంబర్‌పేట్, ముషీరాబాద్, ఉప్పల్, ఖైరతాబాద్, గోషామహల్‌లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక కల్వకుర్తిలో కొద్దీ ఓట్లతో ఓడిపోయింది. మల్కాజిగిరిలో కూడా బీజేపీ తృటిలో గెలుపు వాకిట బోర్లాపడింది. నిజామాబాద్‌లో గతంలో రెండుసార్లు గెల్చింది. పాత ఆదిలాబాద్ జిల్లాలో కూడా బీజేపీ అభ్యర్థులు ప్రభావం చూపే ఆవకాశం ఉందిప్పుడు. గెలుపోటములను కచ్చితంగా ప్రభావితం చేయగలరని బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం అంచనా వేస్తోంది.

పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్ స్థానాల్లో కూడా గట్టి అభ్యర్థులను నిలపాలని బీజేపీ భావిస్తుందిప్పుడు. అన్ని హంగులు పూర్తి చేస్తే మొత్తంగా 30 స్థానాల్లో గెలుపు, ఓటమి స్థాయికి రావాలని భావిస్తుంది. అదే జరిగితే ఇతర పార్టీల్లో టికెట్ రాని బలమైన నాయకులను పార్టీ లో చేర్చుకోవడం ద్వారా పోటీ చేస్తే రాష్ట్రంలో త్రిముఖ పోటీ తేవాలని ఆలోచన చేస్తోంది బీజేపీ. మరి ఈ స్కెచ్ ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
 

Similar News