మహాకూటమి సీట్ల ప్రకటన తర్వాత టిఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది ? కాంగ్రెస్ లోని ద్వితీయ శ్రేణి నేతలతో టచ్‌లో ఉన్న టిఆర్ఎస్ ముఖ్యనేతలు ఏం ఆలోచన చేస్తున్నారు ? ఇప్పటకే అటు కాంగ్రెస్ ఇటు టిడిపి నేతలను కారెక్కించుకున్న గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేస్తుందా ? ఇటీవల ఎంపీ కవిత, మంత్రి హరీష్ రావు మహాకూటమి సీట్ల సర్దుబాటు తర్వాత సినిమా చూడబోతున్నారని పదే పదే చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి ?
టీఆర్ఎస్ పార్టీ 107మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నా మహాకూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరాలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది కూటిమిలోని ఆశావాహుల్లో టెన్షన్ మొదలయ్యింది. కాంగ్రెస్ నుంచి సీట్లను ఆశిస్తున్న అభ్యర్థుల విషయానికొస్తే దాదాపు మెజార్టీ నియోజకవర్గాల్లో నలుగురి నుంచి ఐదుగురు పైగా ఆశావాహులున్నారు. దీనికి తోడు మహకూటిమి పొత్తులో భాగంగా అటు టీడిపి, జనసమితి, సీపిఐ సీట్లు సర్దుబాటు చేస్తే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భారీగా అసమ్మతి నాయకుల ఆందోళనలు మొదలయ్యే అవకాశాలున్నాయి.
మహకూటమిని దెబ్బతీసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గులాబి పార్టీ భావిస్తోంది. సీటు దక్కని కాంగ్రెస్ నేతలను పార్టీలోకి రప్పించేందుకు ఆపరేషన్ గులాబీ ఆకర్ష్ మరోసారి మొదలయ్యింది. ఇందులో బాగంగానే పలు సభల్లో ఎంపి కవిత, మంత్రి హరీష్ రావు కూటమి సర్దుబాటు తర్వాత సినిమా చూడబోతున్నారంటూ మాట్లాడటం గులాబి ఆకర్ష్‌కు బలాన్ని చేకూరుస్తోంది. మహాకూటమిలో ఇప్పటికే 95 సీట్లలో కాంగ్రెస్ పోటిచేస్తుండగా మిగతా పార్టీలకు 24స్థానాలు కేటాయించే అవకాశాలున్నాయి. మరోవైపు సీపిఐ జనసమితి పోటిచేసే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి కూడ బలమైన పోటీదారులున్నారు. వారంతా పొత్తుల్లో సీట్లు ఆయా పార్టీలకు కేటాయిస్తే రెబల్ గానైనా భరిలోకి దిగేందుకు రెడి అవుతున్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సీపిఐ బలంగా కోరుకుంటుంది. ఆ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ తరుపున అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపద్యంలో పొత్తుల్లో సీపిఐకి కేటాయిస్తే అక్కడనుంచి ప్రవీణ్ రెడ్డి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు కొత్తగూడేం నియోజకవర్గం నుంచి సీపిఐ మాజి ఎమ్మెల్యే కూనమనేని సాంభశివరావు పొత్తుల్లో భాగంగా ఖరారయితే .అక్కడనుంచి కాంగ్రెస్ తరుపున టిక్కెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సైతం రెబల్ గానే బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది. ఇక నగరంలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం టీడిపికే ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నేపద్యంలో టీడిపికి టిక్కెట్ ఫైనల్ అయితే మాజి ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ఇండిపెండెంట్‌గా అయినా బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పొత్తుల్లో కాంగ్రెస్ పోటీ చెయ్యని స్ధానాలన్నింటిలోనూ కాంగ్రెస్ రెబల్స్ బరిలోకి దిగుతారని తెలుస్తోంది.
ఇదే అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే అటు బీజేపిలో సీట్లు దక్కని నేతలపై నజర్ పెట్టిన టీఆర్ఎస్ వరుసగా ఆ నేతలను కారెక్కిస్తోంది .పలు జిల్లాల్లో ఏకంగా జిల్లాపార్టీ అధ్యక్షులనే పార్టీలోకి చేర్చుకుంటున్నారు. కరీంనగర్, సంగారెడ్డి జిల్లా బీజేపి ముఖ్యనేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే ఫార్ములాను కాంగ్రెస్‌పై కూడా ప్రయోగించబోతుంది టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడైతే రెబల్ అభ్యర్థులు నిలబడతారో వారితో మంతనాలు జరిపి వారిని కారెక్కించేందుకు రంగం సిద్దం చేస్తోంది గులాబి పార్టీ. మొత్తానికి మహాకూటమిని దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల వేల ఆపరేషన్ అకర్ష్ కి ఎంతమంది ఆకర్షితులవుతారో చూడాలి మరి.