తిరుమల తిరుపతి దేవస్థానం తొందరపాటు చర్య మరోసారి వివాదానికి కారణమైంది. కోర్టు ఫీజు కింద ఏకంగా 2 కోట్ల రూపాయలు చెల్లించి చిక్కుల్లో పడింది. టీటీడీపై విమర్శలు విపక్షాలు చేయడం....తిరుమల తిరుపతి దేవస్థానం అలనా పాలనా వ్యవహారాలపై వివాదాలు రేగడం...కథ కోర్టులకు చేరడం సాధారణ వ్యవహారమే. అయితే ఇటీవల కోర్టులో పరువు నష్టం కేసు వేసిన టీటీడీ...లాయర్ ఫీజు కింద 2 కోట్ల రూపాయలు చెల్లించడమే కలకలం రేపుతోంది.
ఈ మొత్తం వ్యవహారం తిరుమల మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు దగ్గర మొదలైంది. కొద్ది నెలల కింద రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. పింక్ డైమండ్ మిస్సింగ్ వ్యవహారం, శ్రీవారి ఆలయంలో అపచారాలు జరుగుతున్నాయనడం..ఆలయం లోపల తవ్వకాల్లో నిధులు బయట పడ్డాయనీ అవి ఏమయ్యాయని ప్రశ్నించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇదే అదనుగా తీసుకున్న ప్రతి పక్షాలు..నిజాలు తేల్చమని పట్టుబట్టాయి. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఇంకాస్త అడ్వాన్స్ అయ్యి టీటీడీపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అంతే..టీటీడీ...వారిద్దరిపై 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది. అతవరకు బాగానే ఉన్నా...ఆ కేసు వాదించడానికి నియమించుకున్న లాయర్ కు అక్షరాలా 2 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించడమే ఇప్పుడు వివాదం రాజేసింది. శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో, ముడుపుల రూపంలో చెల్లించిన సొమ్మును కోర్టు ఫీజుల కింద వృధా చేస్తున్నారంటూ భక్తులు విమర్శిస్తున్నారు. అయినా చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా..తప్పు చేస్తున్నారని చెప్పే వారిని భయపెట్టడమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.