పుణ్యక్షేత్రమైన తిరుమలలో వెలసిన శ్రీవారి వైభవం నానాటికీ దశదిశలా వ్యాపిస్తొంది...ఆ వెంకన్న క్షణకాల దర్శనభాగ్యం కోసం ఎంతో భక్తిశ్రద్ధలతో భక్తులు ఏడుకొండలపైకి తరలి వస్తుంటారు.....అంతటి ప్రాశస్త్యం కలిగిన శ్రీమన్నారాయణుడి క్షేత్రం ఆధ్యాత్మికతకే కాదు...చెరగని రికార్డులకు నెలవుగా కూడా నిలుస్తొంది... ఇటీవల ఒక్కరోజులోనే లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఆశ్చర్యపరిచింది.
నిత్యకళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీనివాసుడికి యేడాది పొడవునా అనేక ఉత్సవాలు, ఊరేగింపులుసాగుతుంటాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, వేసవి సెలవుల్లో తిరుమల కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. పెరటాసిలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తుతారు. ఈ మాసంలో వచ్చే శని,అదివారాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తజనం తరలివస్తుంటారు. ఈ సారి ఇందుకు భిన్నంగా పెరటాసి మాసం ప్రారంభం నుంచే భక్తుల రద్దీ కొనసాగుతుండడం టీటీడీ అధికారులను ఆశ్చర్యాన్ని గురిచేస్తొంది.
విశేష పర్వదినాల్లో కాదు సాధారణ రోజుల్లో కూడా శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇటీవల ఒక్కో రోజు స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య లక్ష దాటుతుంది. గత రెండు సంవత్సరాల్లో దాదాపు 11 సార్లు లక్షకు పైగా భక్తులు ఒకేరోజులో శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తొంది. తాజాగా సెప్టెంబర్ నెలలో ఒకరోజు 1,05,018 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ నివారణకు తాము చేపడుతున్న చర్యలను భక్తులు సహకరించాలని టీటీడీ కోరుతుంది. భవిష్యత్తులో 365 రోజులు కూడా లక్ష్మీవల్లభుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు బారులు తీరే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు.